6 August, 2026 | 1:25 AM

సర్కారు దవాఖానలో ‘విశ్రాంతి’ కరువు!

06-08-2026 12:01 AM
  1. గదులు లేక చెట్ల కిందే ఆశ్రయం 
  2. అవస్థలు పడుతున్న రోగుల సహాయకులు 
  3. కోతులు, శునకాలు, పందుల, మధ్య రాత్రి బస 
  4. కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు

నర్సాపూర్, ఆగస్టు 5 (విజయక్రాంతి) : డివిజన్ కేంద్రంగా పేరొందిన నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందుతున్నప్పటికీ, వారి వెంట వచ్చే సహాయకులకు మాత్రం కనీస విశ్రాంతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంద పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రికి నర్సాపూర్ పట్టణంతో పాటు కౌడిపల్లి, శివ్వంపేట, హత్నూర, చిలప్చేడ్, వెల్దుర్తి, కొల్చారం, గుమ్మడిదల, మాసాయిపేట తదితర మండలాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు.

ఆసుపత్రిలో రోజుకు 600 నుంచి 800 మంది వరకు ఓపీ సేవలు పొందుతుండగా, నెలకు 700 నుంచి 1000 మంది వరకు ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా నెలకు 70 నుంచి 100 ప్రసవాలు జరుగుతున్నాయి. ఇంతటి రద్దీ ఉండే ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం ఒక్క విశ్రాంతి గది కూడా లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విశ్రాంతి గదులు లేకపోవడంతో రోగుల వెంట వచ్చిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలోని చెట్ల కిందే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

అక్కడే భోజనం చేయడం, విశ్రాంతి తీసుకోవడం అనివార్యమవుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ కాలం గడుపుతున్నారు. రాత్రి వేళల్లో రోగుల వద్ద ఉండే అవకాశం లేకపోతే ఆసుపత్రి ప్రాంగణంలోని ఖాళీ ప్రదేశాల్లోనే నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఆసుపత్రి ఆవరణలో శునకాలు, కోతులు, పందుల సంచారం అధికంగా ఉండడం మరో సమస్యగా మారింది. రోగుల సహాయకులు తెచ్చుకున్న ఆహార సంచులపై కోతులు, పందులు దాడి చేయడం, సంచులను లాక్కెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల మహిళలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రి పరిశుభ్రత, భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంత పెద్ద ప్రభుత్వ వైద్యశాలలో రోగుల సహాయకుల కోసం విశ్రాంతి గదులు, కూర్చునే షెడ్లు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, రాత్రి బసకు అనువైన వసతులు కల్పించాలని ప్రజలు, రోగుల బంధువులు ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు సహాయకులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పిస్తేనే ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఆసుపత్రిలో విశ్రాంతి గదుల నిర్మాణానికి సంబంధించి గతంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ (తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) అధికారులు స్థలాన్ని పరిశీలించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఇందుకోసం  ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం అనుమతులు వస్తే నిర్మాణ పనులు చేపడతాం.

- డాక్టర్ వంశీ క్రిష్ణ, హాస్పిటల్ సూపరింటెండెంట్