6 August, 2026 | 1:04 AM

గద్దర్ ఆశయ సాధనకు కృషి

06-08-2026 12:18 AM

 సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆశలు, ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గద్దర్ వర్ధంతి (ఆగస్టు 6) సందర్భంగా ఆయన సేవలను బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయపూర్వకంగా స్మరించుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ ప్రాణం పోసిన మహనీయుడని, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నిత్యం రగిలించిన అసామాన్య ప్రజాకవిగా ఆయనను కొనియాడారు.

గద్దర్‌తో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భం గా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించినప్పటికీ, ఉన్నత ఉద్యోగాల కోసం కాకుండా సమాజంలోని పేద, బడుగు, బలహీనవర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.

ప్రతి మనిషికి కూడు, గూడు, నీడ దక్కాలనే మహోన్నత లక్ష్యంతో జీవితాంతం పాటనే ఆయుధంగా మార్చుకుని ప్రజల్లో చైతన్యం నింపారని అన్నారు. తెలంగా ణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రముఖుల్లో గద్దర్ అగ్రస్థానంలో నిలిచారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గద్దర్ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, ఆయన ఆశయాలు, ఆలోచనలు భావితరాలకు చేరేలా కృషి చేస్తుందన్నారు.