15 April, 2026 | 3:10 AM

దక్షిణాదికి అన్యాయం జరగదు

15-04-2026 12:42 AM
  1. విభజన పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం
  2. మహిళా బిల్లు తప్పకుండా అమలవుతుంది
  3. మహిళా కోటా, డీలిమిటేషన్ రెండు వేర్వేరు అంశాలు
  4. సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ తప్ప మహిళలంటే కాంగ్రెస్‌కు గౌరవంలేదు
  5. అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్, నెహ్రూనే
  6. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ చేస్తున్నది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు, సీట్లు తగ్గవు.. ఉత్తరం, -దక్షిణం అనే విభజన చేయడం దేశ సమగ్రతకు విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నా రు. దేశాన్ని కులం, మతం, ప్రాంతాల పేరుతో విభజించి రాజకీయ లాభాలు పొందే ప్రయ త్నం చేసేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

రాహుల్‌గాంధీ గుర్తుంచుకోవాల్సింది.. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకోవడం కాదు.. మనసులో పెట్టుకొని ఆచరించాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ రెండు వేర్వేరు అంశాలని, జనగణన మరో అంశమని, ఈ మూడు అంశాలను కలిపి కాంగ్రెస్ ప్రజల్లో గందరగోళం సృష్టించడం, అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసి తీరుతామని స్పష్టంచేశారు. మంగళవారం అంబే డ్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడు తూ.. ఈ మూడు అంశాలు వేర్వేరని రాహుల్ గాంధీయే పార్లమెంట్లో స్వయంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి జనగణన లేదా డీలిమిటేషన్‌తో సంబంధం లేదని చెప్పారు.

కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఈ మూడు అంశాలను కలిపి మాట్లాడుతున్నారన్నారు. ఆదాయం ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్ నుంచే వస్తోంది మరీ ఎక్కువ సీట్లు వీటికే ఇవ్వాలా? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తప్పకుండా అమలవుతుందని, ఎవ్వరూ ఆపలేరన్నారు.

డీలిమిటేషన్, సెన్సస్ అన్నీ రాజ్యాంగబద్ధంగా, నిర్దిష్ట విధానాల ప్రకారం జరుగుతాయని, ప్రజలు అపోహలకు లోనుకాకుండా వాస్తవాలను అర్థం చేసుకోవాలన్నా రు. డీలిమిటేషన్ అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అన్నారు. 1952, 1962, 1972, 2002లో డీలిమిటేషన్ చేశారని, నాటినుంచి 1971 జనాభా ఆధారంగానే 543 లోక్‌సభ సీట్లు కొనసాగుతున్నాయన్నారు.

మహిళా సాధికారతపై మాట్లాడే నైతిక హక్కు లేదు

మహిళల సాధికారత గురించి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ  నాయకత్వంలోకి రావడం వారసత్వ రాజకీయాల ఫలితం మాత్రమేనని రాంచందర్‌రావు అన్నారు. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ తప్ప కాంగ్రెస్‌కు మహిళలంటే గౌరవం లేదని, అందుకే బిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారో తెలియదు కానీ, అంబేద్కర్‌ను అవామనించింది కాంగ్రెస్, నెహ్రూనే అని ఆరోపించారు.

స్వాతంత్య్రానికి ముందు బాంబే ప్రెసిడెన్సీలో అంబేద్కర్‌ని పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఆయనకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి ఓడించడం, రాజ్యాంగ సభలో ఆయనకు అవకాశం ఇవ్వకపోవడం వంటి చర్యలు కాంగ్రెస్ చేసినవే వివరించారు. చివరికి ముస్లిం లీగ్ మద్దతుతోనే ఆయన అసెంబ్లీలోకి ప్రవేశించాల్సి వచ్చిందన్నారు.

డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా అంబేద్కర్‌ను అంగీకరించడంలో కూడా కాంగ్రెస్ నాయకత్వం తొలుత వ్యతిరేకించిందని, ముఖ్యంగా నెహ్రూ అనేక ప్రతిపాదనలను వ్యతిరేకించారన్నారు. 1953 లో నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో రిజర్వేషన్లు ప్రమాదకరమని పేర్కొన్నారని గుర్తుచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్య ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశారన్నారు.