14 March, 2026 | 5:17 AM

ఎల్‌పీజీ సిలిండర్ల విషయంలో ఆందోళన వద్దు

14-03-2026 12:15 AM

జిల్లా అవసరాలకు సరిపడా అందుబాటులో ఉన్నాయి 

పర్యవేక్షక కమిటీ సమావేశంలో కలెక్టర్ వెల్లడి 

అక్రమాలకు ఆస్కారం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం 

విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ఇండెంట్ అందిన వెంటనే గ్యాస్ సరఫరా చేయాలి 

నిజామాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో గ్యాస్ కొరత ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది.

జిల్లాలో వంట గ్యాస్ డిమాండ్, సరఫరా తీరుతెన్నుల గురించి ఈ సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని, శుక్రవారం నాటికి 10,850 సిలిండర్లు జిల్లాలో  గృహావసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయని, వీటికి అదనంగా మరో 5,875 సిలిండర్లు జిల్లాకు రానున్నాయని పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సిలిండర్ బుక్ చేసిన వారికి మూడు నుంచి  నాలుగు రోజుల వ్యవధిలో గృహావసరాల సిలిండర్లు పంపిణీ చేయబడుతున్నాయని తెలిపారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎల్.పీ.జీ సిలిండర్ల పంపిణీని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి, బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే, నిత్యావసర సరకుల చట్టం, 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తనిఖీలను ముమ్మరం చేయించామని, ప్రస్తుత మార్చి నెలలో ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు ఆకస్మిక దాడులు జరిపిన సందర్భంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 156 డొమెస్టిక్ సిలిండర్లను వివిధ వ్యాపార, వాణిజ్య దుకాణాల నుండి స్వాధీనం చేసుకుని వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారని కలెక్టర్ వివరించారు. హోటళ్ళు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలకు, ఆసుపత్రులకు, అంగన్వాడీ కేంద్రాలకు, అనాధశ్రమాలకు ఇండెంట్ లు అందిన వెంటనే జాప్యానికి తావు లేకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని ఏజెన్సీల నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులు, రోగులు, వారి అటెండెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అన్నారు. ఆసుపత్రులలో ఇన్ పేషంట్ల సంఖ్యకు అనుగుణంగానే సిలిండర్లు ఇండెంట్ పెట్టేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని డీ.ఎం.హెచ్.ఓను ఆదేశించారు.

ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత ఎంతమాత్రం లేదని అన్నారు. ఎల్.పీ.జీ వినియోగదారులు ఆన్లైన్లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని, ఏజెన్సీల వద్దకు, గ్యాస్ గోదాముల వద్దకు వెళ్లవద్దని కలెక్టర్ కోరారు. గ్యాస్ బుకింగ్ కోసం సింగిల్ సిలిండర్ కి 25 రోజులు, డబుల్  సిలిండర్ కి 45 రోజుల వ్యవధి తర్వాత మాత్రమే బుకింగ్ నమోదు నిబంధన అమలులో ఉందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, నిర్ణీత వ్యవధి దాటిన తరువాతనే గ్యాస్ రీఫిల్ కోసం బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

కాగా, కొంతమంది వినియోగదారులు సిలిండర్ లో ఇంకను గ్యాస్ నిల్వలు కొంతవరకు మిగిలి ఉన్నప్పటికీ, కొత్తగా బుకింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ తరహా ఆదుర్దాను ప్రదర్శించడం వల్ల గ్యాస్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని, గ్యాస్ సిలిండర్ పూర్తిగా ఖాళీ అయి, నిర్ణీత వ్యవధి దాటిన అనంతరమే బుకింగ్ చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ కి ఓటీపీ చెప్పి సహకరించాలని, వారి విధులకు ఎవరైనా ఆటంకము కలిగించినట్లయితే, అలాంటి వినియోగదరులపైన కూడా చట్టపరముగా చర్యలు తీసుకోబడతాయని అన్నారు.

ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీల వద్ద, ఆన్లైన్లో కానీ గ్యాస్ కంపెనీ అధికారిక వ్బుసైట్ లేదా యాప్ లో, గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వద్ద  కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు.    ఈ సమావేశంలో అదనపు డీ.సీ.పీ బస్వారెడ్డి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఎ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, డీ.టీ.ఓ ఉమామహేశ్వర్ రావు, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, డీ.డబ్ల్యూ.ఓ పద్మ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ఆర్ సీ ఓ లు, గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు, ఎల్.పీ.జీ డీలర్లు  పాల్గొన్నారు.