బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు
- పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
- అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల అమలు : మంత్రి సీతక్క
- కొత్తగూడ, గంగారం మండలాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మహబూబాబాద్ సెప్టెంబర్ 1, (విజయక్రాంతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ పేద కుటుంబాలకు రేషన్ కార్డు అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదని, అనేక సంక్షేమ పథకాలకు అది కీలక ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గతంలో రేషన్ కార్డుల కోసం అనేక మంది పేదలు ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించి వారికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపిం చారు. అర్హులైన అనేక కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. పేదలకు అవసరమైన సంక్షేమ పథకాలు అందించాల్సిన సమయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని సీతక్క తెలిపారు. పేదలు, అర్హులైన కుటుంబాలు ప్రభుత్వ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావులేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా అర్హత ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. పేదల సంక్షేమం విషయంలో అర్హతనే ప్రామాణికంగా తీసుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు వారికి అవసరమైన ఇతర సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






