25-01-2026 12:43:31 AM
భార్యాభర్తల తగువులు, గిల్లికజ్జాలు, సంసారం చుట్టూ అల్లే కథలు ఎప్పటికీ ప్రేక్షకులకు బోర్ కొట్టవు. ఇక ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పురుషః’. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, వీటీవీ గణేశ్, సప్తగిరి, పమ్మి సాయి, పవన్‌కళ్యాణ్, కసిరెడ్డి రాజకుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్, శ్రీసంధ్య, గబిరాక్, అనైరా గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రంలోని ‘జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను ఎంఎం కీరవాణి ఆలపించారు. శ్రవణ్ భరద్వాజ్ స్వరపర్చిన ఈ గీతానికి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. సినిమా కథను వివరించేలా, కథనాన్ని అందరికీ ముందే చెప్పినట్టుగా ఉందీ పాట. ఎంతో ఫన్నీగా సాగిన ఈ లిరిక్స్ భార్యాభర్తల మధ్య బంధాన్ని వివరించాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీశ్ ముత్యాల; ఎడిటర్: కోటి; ఆర్ట్: రవిబాబు దొండపాటి.