calender_icon.png 25 January, 2026 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమిళ దర్శకుడితో..!

25-01-2026 12:43:44 AM

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘అఖండ2 తాండవం’ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. తెలుగుతోపాటు పాన్ ఇండి యా స్థాయిలో విడుదల చేసిన ఈ సినిమా ఎక్కువగా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తర్వాత బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా బాలకృష్ణ 111వ సినిమాగా రానుంది.

కొన్ని నెలల క్రితమే ఈ ప్రాజెక్టును ప్రకటించడం.. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా కథను మార్చాల్సి వచ్చిందట. అయితే, కొన్ని రోజులుగా మరో కథపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని కసరత్తులు చేస్తున్నారు. ఈ కొత్త కథను ఇటీవలే బాలకృష్ణకు చెప్పడం.. ఆయన పచ్చజెండా ఊపడం వెనువెంటనే జరిగిపోవటంతో చిత్రీకరణకు చకచకా ఏర్పా ట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా భారీ మాస్ యాక్షన్ కథా చిత్రంగా రాబోతున్నట్టు ప్రచా రం జరుగుతోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చిలో పట్టాలెక్కించనున్నారు.

ఇందులో తొలుత కథానాయికగా నయనతార పేరు వినిపించింది. కథ మారిన నేపథ్యంలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేస్తారా? లేక నయనతారకే చోటు దక్కుతుందా అనే విషయమై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదే కాకుండా ఇప్పుడు బాలకృష్ణకు ఓ తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఓ కథ చెప్పారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా బాలకృష్ణను మెప్పించగా అతడితో ఓ సినిమా చేయాలనుకున్నారట. ఈ క్రమంలోనే ఓ స్టోరీ లైన్ వినిపించగా.. బాగా నచ్చేసిందట బాలాకు. ఇక బాలకృష్ణ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే త్వరలోనే వీరి కాంబోలో ఓ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.