8 June, 2026 | 2:06 PM

కాళేశ్వరం అవినీతిపై ఎవరికీ క్లీన్ చిట్ లేదు

08-06-2026 01:00 PM

పెద్దపల్లి లో విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు

పెద్దపల్లి,జూన్ 8(విజయక్రాంతి): కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టు ఎటువంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోవడం అనాలోచిత నిర్మాణానికి నిదర్శనమని విజయ రమణారావు విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యం బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎండగడుతోందని పేర్కొన్నారు.

 హరీష్ రావుపై విమర్శలు

నిరంతరం కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పే షహరీష్ రావు, ప్రాజెక్టు కుంగిపోయినప్పుడు ఎందుకు బాధ్యత వహించరని ఆయన ప్రశ్నించారు. ప్రజల సెంటిమెంటుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

సీబీఐ విచారణపై డిమాండ్

కాళేశ్వరం అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి సీబీఐకి నివేదించినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే సాకారమయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోనే రైతుల సాగునీటి కష్టాలు తీరుతున్నాయని ఆయన తెలిపారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వారి మాటలను నమ్మే స్థితిలో లేరని విజయ రమణారావు పేర్కొన్నారు.