17 April, 2026 | 7:15 AM

సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్‌ను మించినోరే లేరు

29-05-2025 01:14 AM

మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, మే 28 (విజయక్రాంతి) : ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఇప్పటివరకు కేసీఆర్ ను మించిన వారే లేరని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.

నియోజకవర్గం వ్యాప్తంగా బుధవారం పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన మాట్లాడారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రపంచంలో మరెక్కడా అమలు చేయలేదన్నారు. అడిగినవే కాదు.. అవసరమనుకున్న అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.

ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఏమీ చేయలేక చేతులెత్తేసిందన్నారు.  6 గ్యారెంటీలు, 420 హామీలు ఏమైనవయో ప్రభుత్వ పెద్దలు ప్రజలకు వివరించాలన్నారు. కళ్యాణలక్ష్మీ కింద కెసిఆర్ ఇచ్చిన లక్ష తప్ప తులం బంగారం ఊసే లేకుండా పోయిందన్నారు.

ఒక్కరిద్దరికే పరిమితమైన సీఎంఆర్‌ఎఫ్ ను అందరికీ చేరువ చేసింది కెసిఆర్ అన్నారు. రైతు భరోసా దేవుడెరుగు కానీ.. నేడు వ్యవసాయానికే భరోసా లేకుండాపోయిందన్నారు. నారుమళ్లలా మారిన కల్లాలను చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ఈ ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ మాయలకు మోసపోయామని అర్థం చేసుకున్న ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారన్నారు. ఈయన వెంట నాయకులు వెంకటనారాయణ గౌడ్, తదితరులు ఉన్నారు.