30 May, 2026 | 2:47 AM

మీ సేవా కార్యాలయంలో పోలీస్ స్టేషన్ వద్దు

30-05-2026 12:12 AM
  1. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 
  2. జీహెచ్‌ఎంసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వికాస్‌నగర్ కాలనీలో స్థానికుల ధర్నా 

ఎల్బీనగర్, మే 29 : మీ సేవా కార్యాలయంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవద్దని, కమ్యూనిటీ హాలును స్థానికుల అవసరాలకు ఇవ్వాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. చైతన్యపురి డివిజన్ పరిధిలోని వికాస్నగర్లో ఉన్న మీ సేవా కేంద్రంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ను మీ సేవ కార్యాలయం కోసం వినియోగించాలనే జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం స్థానికులు ఆందోళన చేపట్టారు.

వికాస్నగర్ కాలనీలోని మీ సేవా కేంద్రం వద్ద నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...  మీ సేవా కేంద్రం భవనంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని, కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఇప్పటికే ప్రజలకు సేవలందిస్తున్న కార్యాలయాలను తొలగించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

న్యూ దిల్సుఖ్నగర్ కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న సీనియర్ సిటిజన్స్ భవనాన్ని మీ సేవ కార్యాలయానికి కేటాయిస్తే, వృద్ధులకు కాలక్షేపం చేసేందుకు స్థలం లేకుండా పోతుందని తెలిపారు. ఔ భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సీనియర్ సిటిజన్స్కే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఎల్బీనగర్ టీమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో పోలీస్ స్టేషన్ కోసం 3000 గజాల స్థలం కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అక్కడ నిర్మాణం చేపట్టకుండా ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడుతున్న భవనాలను ఖాళీ చేయించడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని కాలనీవాసులు కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,

డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, త్రివేది, నర్సిరెడ్డి, శివప్రకాష్, నాగలక్ష్మి, న్యూ దిల్సుఖ్నగర్ కాలనీవాసులు సుష్మిత, రోజా పద్మిని, భవాని నగర్ కాలనీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, వికాస్నగర్ కాలనీ అధ్యక్షులు వెంకటేష్, శోభారాణి, విద్యుత్ నగర్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాసచారి, ద్వారకాపురం సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు ప్రసాద్, పవన్ సంతోష్, తులసి కృష్ణ, గట్టు శ్రీను, రమణారెడ్డి, జలంధర్, కిరణ్, నరేష్, శ్రీధర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.