30 May, 2026 | 2:47 AM

మహిళల భద్రతే లక్ష్యం

30-05-2026 12:14 AM

మల్కాజిగిరి షీ టీమ్స్ ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సెలింగ్ కార్యక్రమం

నాగోల్, మే 29 (విజయ క్రాంతి): మహిళలు, చిన్నారులపై జరిగే వేధింపులు, నేరాలను అరికట్టేందుకు ప్రవర్తనా మార్పు అవసరమని మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్ బి.సుమతి ఐపీఎస్ పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన వారిని చట్టపరమైన అవగాహనతో పాటు మానసికంగా మార్చేందుకు మల్కాజిగిరి కమిషనరేట్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో గురువారం నాగోల్ పిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో సంస్కార్ మెగా కౌన్సెలింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు.

మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్ సుమతి అన్నారు. సమాజంలో పురుషులు, మహిళలు సమాన భాగస్వాములని, ప్రతి మహిళకు గౌరవంతో జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు. సమాజం అభివృద్ధి చెందుతున్నప్పటికీ మహిళలపై వేధింపులు, గృహ హింస, చిన్నారులపై దాడులు ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకరమని చెప్పారు. షీ టీమ్స్ లక్ష్యం కేవలం చట్ట అమలు మాత్రమే కాదని, తప్పు చేసిన వారు తమ ప్రవర్తనను మార్చుకుని బాధ్యతాయుత పౌరులుగా మారేందుకు అవకాశం కల్పించడమని తెలిపారు.

ఒకసారి పోలీసు రికార్డుల్లో పేరు నమోదైతే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని, కౌన్సెలింగ్ ద్వారా మార్పు సాధించు కోవాలని సూచించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 18 వరకు మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ల పరిధిలో షీ టీమ్స్ 61 ఎఫ్‌ఐఆర్లు నమోదు చేసి, 236 పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 760 మందిని అదుపులోకి తీసుకున్నామని, అందులో 137 మంది మైనర్లు, 384 మంది 24 ఏళ్ల లోపు యువకులే ఉండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.

మహిళలకు సమాజంలో ఎంత భద్రత కల్పిస్తున్నాం? అని ప్రశ్నించిన కమిషనర్, మహిళలు, చిన్నారులు భయంలేకుండా జీవించే వాతావరణం సృష్టించడం అందరి బాధ్యత అని అన్నారు. మహిళలపై వేధింపులు, చిన్నారులపై నేరాలు, గృహహింస వంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. షీ టీమ్స్ ఇప్పటివరకు 406 విద్యాసంస్థలు, పలు ప్రజా ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 53 వేల మందికి పైగా ప్రజలకు మహిళల భద్రత, సైబర్ సేఫ్టీ, పోక్సో చట్టం, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. మైనర్లు, పెద్దల్లో దీర్ఘకాలిక ప్రవర్తనా మార్పు కోసం ఫాలోఅప్ కౌన్సెలింగ్ కార్యక్రమాలు కొనసాగి స్తామని వెల్లడించారు.

కార్యక్రమంలో మనోజాగృతి సంస్థ అధిపతి, సైకాలజిస్ట్ గీతా చల్లా మరియు ఆమె బృందం భావోద్వేగ నియంత్రణ, బాధ్యతాయుత ప్రవర్తన, సామాజిక అవగాహనపై కౌన్సెలింగ్ నిర్వహించారు. న్యాయ నిపుణులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), పోక్సో చట్టం, ఐటీ చట్టం తదితర మహిళా, చిన్నారుల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోన్ డీసీపీ డాక్టర్ బి.అనురాధ ఐపీఎస్, ఉమెన్ సేఫ్టీ డీసీపీ టి.ఉషారాణి, అదనపు డీసీపీ బి.కోటేశ్వరరావు, షీ టీమ్స్ ఏసీపీ పి.వెంకటేశ్వర్లు, న్యాయ సలహాదారు కృష్ణమోహన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్, పోలీసులు, కౌన్సెలింగ్ నిపుణులు, ప్రతిస్పందకులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.