31 July, 2026 | 12:52 AM

ఆహారం కాదు.. విషాహారం!

31-07-2026 12:00 AM

ఈ భూమిపై మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం అనే మూడు ప్రాథమిక అవసరాలను ప్రకృతి ప్రసాదించింది. భారతీయ సంస్కృతిలో ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. ఇది మన జీవన విధానానికి, ఆరోగ్యానికి, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతీక. కాలక్రమేణా మనిషి సాధించిన సాంకేతిక ప్రగతి, పారిశ్రామికీకరణ, అపూర్వమైన పురోగతి, మితిమీరిన వ్యాపారీకరణల ఫలితంగా నేడు మన భోజన పళ్లెం ఒక రసాయన ప్రయోగశాలగా మారిపోయింది. నేడు అదే అన్నం, కూరగాయలు, పండ్లు ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం కాదని, అవి విషపూరితంగా మారాయనే చేస్తుందనే సందేహం ప్రతి కుటుంబాన్ని వెంటాడుతోంది. ఇది కేవలం వ్యవసాయ సమస్య కాదు, ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, భవిష్యత్ తరాల మనుగడకు సంబంధించిన జాతీయ సమస్య.

ఒకప్పుడు పొలాల్లోంచి సువాసనలు వెదజల్లుతూ ఇళ్లకు చేరిన ధాన్యాలు, నేడు విషపూరిత రసాయనాల అవశేషాలను మోస్తూ మన శరీరాలను రోగాలమయంగా మార్చుతున్నాయి. మనం తినే ఆహారమే మనల్ని నిర్మిస్తుందనే ప్రాచీన వైద్య సూత్ర స్థానంలో మనం తినే ఆహారమే మనల్ని అంతం చేస్తోందనే ఆధునిక భయం ఆవరించింది. నాగరికత శిఖరాగ్రాన్ని చేరిన మనిషి, తన నోట్లో వేసుకునే ముద్ద ఎంత సురక్షితమో చెప్పలేని దైన్య స్థితికి చేరుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద మానవీయ, వైజ్ఞానిక పరాజయం.

1960లలో తీవ్రమైన ఆహార కొరత, కరువు కాటకాలు అనేక దేశాలను అతలాకుతలం చేశాయి. నాడు అమెరికా నుంచి పి.ఎల్- పథకం కింద దిగుమతి చేసుకునే నాసిరకం గోధుమలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశాన్ని ఆకలిచావుల నుంచి రక్షించడానికి హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు.

అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలు, రసాయనిక ఎరువులు, సింథటిక్ పురుగుమందుల వాడకం రాత్రికి రాత్రే దేశాన్ని ఆహార స్వయంసమృద్ధి వైపు నడిపించింది. అప్పట్లో ఆకలితీర్చడం ఏకైక లక్ష్యం కాబట్టి, శాస్త్రవేత్తలు, పాలకులు దీని వెనుక ఉన్న దీర్ఘకాలిక పర్యావరణ నష్టాలను విస్మరించారు. నాడు ప్రారంభమైన రసాయనాల ప్రస్థానం నేడు నియంత్రణ లేని మహమ్మారిగా రూపాంతరం చెందింది. భూమికి సహజంగా ఉండే రోగనిరోధక శక్తిని రసాయన ఎరువులతో చంపేశాం.

ఫలితంగా, మొక్కలు బలహీనపడి చుట్టుపక్కల ఉండే కీటకాలకు సులభంగా లొంగిపోయాయి. దానివల్ల కీటకాలను చంపడానికి మరింత శక్తివంతమైన విషపూరిత పురుగుమందులను వాడాల్సి వచ్చింది. అతి సర్వత్ర వర్జయేత్ అనేది వ్యవసాయానికీ వర్తిస్తుంది. అవసరాన్ని మించి వాడిన ప్రతి రసాయనం భూమిని బలహీనపరిచింది. నీటిని కలుషితం చేసింది. ఆహారాన్ని విషపూరితం చేసింది.

మనం తినే ఆహారం విత్తనం దశ నుంచి పళ్లెం వరకు ఎన్నో రసాయన దశలను దాటుతోంది. తొలుత నేల ద్వారా వచ్చే కీటకాల రక్షణ కోసం విత్తనాలకు థైరామ్, కార్బెండజిమ్ వంటి పొడులను పూస్తుండగా, మొక్క ఎదుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాషియం కోసం సహజ ఎరువుల స్థానంలో చల్లుతున్న యూరియా, డీఏపీ వంటి సింథటిక్ ఎరువులు నేలలోని మేలుచేసే బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేస్తున్నాయి.

కూలీల ఖర్చు లు తగ్గించుకోవడానికి వాడే గ్లైఫోసేట్, అట్రాజిన్ వంటి కలుపు నాశకాలు భూగర్భజలాల్లోకి చేరుతుండగా, ఇందులోని గ్లైఫోసేట్ వల్ల క్యాన్సర్ సోకే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పంట కాలంలో అంతర్జాతీయంగా నిషేధించిన మోనోక్రోటోఫాస్, ఆర్గానోఫాస్ఫేట్ల వంటి ప్రమాదకర పురుగుమందులను యథేచ్ఛగా స్ప్రే చేస్తూ, పంట చేతికి వచ్చాక గిడ్డంగుల్లో పురుగులు పట్టకుండా అల్యూమినియం ఫాస్ఫైడ్ మాత్రలు వేయడం, పండ్లు పాడవ్వకుండా రసాయన వ్యాక్స్ పూతలు పూయడంతో ప్రతి దశలోనూ ఆహారం విషతుల్యమవుతోంది.

కూరగాయలు తాజాగా కనిపించడానికి మలాకైట్ గ్రీన్ అనే రసాయన రంగును వాడుతున్నారు. ముఖ్యంగా బెండకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చిని ఈ రంగు నీళ్లలో ముంచి తీస్తారు. ఇది కాలేయం, మూత్రపిండాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. మామిడి, అరటిపండ్లను సహజంగా పండనివ్వకుండా, కాల్షియం కార్బైడ్ వాడి కృత్రిమంగా మగ్గబెడుతున్నారు. కాల్షియం క్బాడ్ నుంచి వెలువడే ఎసిటిలిన్ వాయువు వల్ల పండ్లు పసుపు రంగులోకి మారతాయి.

ఇందులో ఉండే ఆర్సెనిక్, ఫాస్ఫరస్ అవశేషాలు నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. యాపిల్ పండ్లు చాలా రోజులపాటు నిగనిగలాడుతూ ఉండటానికి వాటిపై షెల్లాక్ లేదా పెట్రోలియం ఆధారిత వ్యాక్స్ పూస్తారు. నేడు డెయిరీరంగంలో జరుగుతున్న పద్ధతులు పాలును విషతుల్యం చేస్తున్నాయి. ఆవులు, గేదెలు ఎక్కువ పాలు ఇవ్వడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇంజెక్షన్లను ఇస్తున్నారు. ఈ పాలు తాగడం వల్ల చిన్నపిల్లలలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, చిన్న వయస్సులోనే బాలికలు రజస్వల కావడం, బాలురలో శారీరక మార్పులు వస్తున్నాయి.

పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్లు 40 రోజుల్లోనే రెండు నుంచి మూడు కిలోల బరువు పెరగడానికి దానాలో యాంటీబయాటిక్స్, గ్రోత్ హార్మోన్లను కలుపుతున్నారు. కోళ్లకు నిరంతరం యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల వాటి శరీరంలోని బ్యాక్టీరియా ఆ మందులను తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటుంది. ఆ మాంసాన్ని మనుషులు తిన్నప్పుడు, మనుషుల శరీరంలోకి ఆ బ్యాక్టీరియా చేరి, భవిష్యత్తులో మనకు ఏదైనా వ్యాధి వస్తే సాధారణ యాంటీబయాటిక్ మందులు పనిచేయని స్థితి ఏర్పడుతుంది.

నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో సమయం లేక చిప్స్, నూడుల్స్, కూల్‌డ్రింక్స్ వంటి ఇన్‌స్టంట్ ప్యాకేజ్డ్ ఆహారాలకు ఆదరణ పెరిగినప్పటికీ, ఇవి రసాయనాల గిడ్డంగులుగా మారాయి. వీటిలో రుచి కోసం వాడే అజినోమోటో నరాల బలహీనతకు దారితీస్తుంటే, డైట్ పానీయాల్లోని అస్పర్టేమ్ గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

నిల్వ కోసం శీతల పానీయాలు, పచ్చళ్లలో వాడే సోడియం బెంజోయేట్, సోడియం నైట్రేట్ వంటి ప్రిజర్వేటివ్‌లు క్యాన్సర్‌కు కారణమవుతుంటే, బిస్కెట్లలో వాడే చౌకైన హై-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఫ్యాటీ లివర్, టైప్- మధుమేహానికి దారితీస్తూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. శరీరంలోకి చేరే రసాయనాలు అంతస్రావ గ్రంథుల పనితీరును దెబ్బతీస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి మధుమేహం, థైరాయిడ్, మహిళల్లో పీసీవోడీ సమస్యలు పెరిగి సంతానలేమికి దారితీయడం, పురుషులలో వీర్యకణాల సంఖ్య పడిపోవడం లాంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయి.

రసాయన ఎరువుల అధిక వినియోగంతో నేలలో హ్యూమస్ తగ్గి, వానపాములు అంతరించడంతో భూమి సహజ సారాన్ని కోల్పోతున్నది. పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి పరాగసంపర్క జీవులు తగ్గిపోతుండగా, రాచెల్ కార్సన్ హెచ్చరించిన సైలెంట్ స్ప్రింగ్ పరిస్థితి వైపు ప్రపంచం సాగుతోంది. 

పూర్వం మనుషులు 80- ఏళ్లు ఆరోగ్యంగా జీవించేవారు. కానీ, నేడు 30 ఏళ్లకే గుండెపోటుతో చనిపోవడం, 10 ఏళ్లకే పిల్లలు ఊబకాయంతో బాధపడటాన్ని చూస్తున్నాం. పంజాబ్‌లోని భటిండా ప్రాంతాన్ని క్యాన్సర్ బెల్ట్ అని పిలుస్తారు. అక్కడ కాటన్ పంటలకు విపరీతంగా పురుగుమందులు వాడటం వల్ల భూగర్భజలాలు విషపూరితమై, ప్రతి ఇంట్లో ఓ క్యాన్సర్ రోగి ఉండే పరిస్థితి వచ్చింది. భటిండా నుంచి బికనీర్‌లోని క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లే రైలును ప్రజలు అధికారికంగా క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్ అంటారు. 

ఈ నేపథ్యంలో రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గిస్తూ సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, జీవామృతం, వేప ఆధారిత జీవ నియంత్రణ వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలి. ప్రభుత్వం ప్రమాదకర రసాయనాలను దశలవారీగా నిషేధించి, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్, మద్దతు ధర కల్పించాలి. వినియోగదారులు కూడా ఆహారాన్ని జాగ్రత్తగా శుభ్రపరచి వాడాలి. ఎందుకంటే నిజమైన అభివృద్ధి అంటే ఐటీ టవర్లు కాదు; స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన ఆహారంతో ఆరోగ్యవంతమైన తరాలను నిర్మించడమే. పిల్లలకు ఆస్తుల కంటే ఆరోగ్యమే గొప్ప వారసత్వం. అందుకే ప్రకృతికి అనుకూలమైన జీవన విధానమే మానవాళికి నిజమైన సంజీవని.

వ్యాసకర్త సెల్: 8466827118

దుప్పటి మొగిలి