రాష్ట్ర అప్పుల బాధ్యత పాలకులదే
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పుల భారంపై కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజాగా ఓ నివేదిక ఇచ్చింది. గత కేసీఆర్ ప్రభుత్వం, నిపుణుల సలహాలను విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం పరిపాలనా వైఫల్యం, జవాబుదారీతనం లేమి కిందకే వస్తుందని తెలిపింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాధనాన్ని వెచ్చించేటప్పుడు పారదర్శకత, జవాబుదారీతనం ఎంత ముఖ్యమో కాగ్ నివేదికలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సగటున రోజుకు రూ.496 కోట్లు ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కాగ్ నివేదిక ప్రకారం భారీ ఎత్తున ప్రజాధనం వృథా అయినట్టు తెలుస్తున్నది.
దీని వెనుక అవినీతి, ఉద్దేశపూర్వక అధికార దుర్వినియోగం ఏ మేరకు ఉందనేది ప్రస్తుతం జరుగుతున్న న్యాయ విచారణల నివేదికలు బయటకు వచ్చిన తర్వాత చట్టబద్ధంగా నిర్ధారణ అవుతుంది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.69 వేల కోట్ల అప్పుతో పాటు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ పదేళ్ల పాలన ముగిసే నాటికి, కార్పొరేషన్ గ్యారంటీలతో కలిపి ఇది సుమారు రూ.8.11 లక్షల కోట్లకు చేరిందని ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తోంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని, ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.
మరోవైపు, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి కొన్ని నెలల్లోనే బాండ్లు, వివిధ మార్గాల ద్వారా సుమారు రూ.75,995 కోట్ల అప్పు చేసిందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. కేవలం బాండ్ల వేలంతో ఆర్బీఐ నుంచి రూ.46,118 కోట్లు అప్పు చేశారని, మిగతావి వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చారని వారు పేర్కొంటున్నారు. ఈ విధంగా ఇరు పార్టీలు తెలంగాణను అప్పులపాలు చేయడంతో రాష్ట్రంలో ప్రతి పౌరుడిపై ప్రస్తుతం సుమారు రూ.2.46 లక్షల వరకు అప్పు భారం పడుతోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫునే రుణాలు సమీకరిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులకు రాజ్యాంగపరంగా, ఆర్థికపరంగా, రాజకీయంగా వివిధ వ్యవస్థలు బాధ్యత వహిస్తాయి. కేసీఆర్ పాలనా కాలంలో అప్పులను నిరుపయోగంగా కాకుం డా నీటిపారుదల, విద్యుత్, తాగునీరు వంటి ఆస్తుల సృష్టి కోసం ఉపయోగించామని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.
ప్రాజెక్టుల నిర్మాణం (కాళేశ్వరం, మిషన్ భగీరథ మొదలైనవి), మౌలిక వసతులు, సంక్షేమ పథకాల కోసం తీసుకున్న అప్పులకు ఆ నిర్ణయాలు తీసుకున్న అప్పటి ప్రభుత్వానిదే ప్రాథమిక బాధ్యత. గత ప్రభుత్వం ప్రణాళిక లేని వ్యయం చేయడం వల్ల అప్పుల భారం పెరిగిందని, ఇప్పుడు వస్తున్న ఆదాయంలో అధిక భాగం పాత అప్పుల వడ్డీలు కట్టడానికే సరిపోతోందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే, రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు, పాత అప్పులను తీర్చే విధానం, ఆర్థిక నిర్వహణకు ప్రస్తుత ప్రభుత్వానిదే బాధ్యత. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ, ప్రభుత్వం చేసే అప్పుల అసలు, వడ్డీలను చెల్లించడానికి ఉపయోగించే నిధులు ప్రజలు కట్టే నేరుగా లేదా పరోక్ష పన్నుల నుంచే వస్తాయి.
కాళేశ్వరంపై కాగ్ నివేదిక
ప్రారంభంలో రూ.81,791 కోట్లుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ప్రణాళిక లేని మార్పుల వల్ల రూ.1.47 లక్షల కోట్లకు పెరిగింది. 18.25 లక్షల ఎకరాలకు కొత్తగా నీరందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, మార్చి 2022 నాటికి సుమారు 45 వేల ఎకరాల కు (సుమారు 5%) మాత్రమే నీరందింది. ప్రాజెక్టు ద్వారా వచ్చే రాబడి కంటే, పంప్ హౌస్‌ల విద్యుత్ బిల్లులు, అప్పుల వడ్డీలే రాష్ట్ర ఖజానాకు భారం కానున్నాయని కాగ్ తెలిపింది. ప్రత్యామ్నాయాలను పరిశీలించకుండానే హడావుడిగా ప్రాజెక్టు డిజైన్లు మార్చారని పేర్కొంది.
కాళేశ్వరంపై కాగ్ నివేదికలోని వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం వాస్తవమే. ప్రాజెక్టు వ్యయానికి, దాని ద్వారా జరిగిన ప్రత్యక్ష ప్రయోజనానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని కాగ్ తన నివేదికలో తీవ్రంగా తప్పుబట్టింది. సరైన ప్రణాళిక (డీపీఆర్) లేకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం, నిబంధనలను ఉల్లంఘించి కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడం వంటివి స్పష్టమైన పరిపాలనా వైఫల్యం, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తాయని కాగ్ నివేదిక ద్వారా అర్థమవుతోంది.
కాగ్ అనేది ప్రభుత్వ లెక్కలను తనిఖీ చేసి తప్పులను ఎత్తిచూపే రాజ్యాంగ సంస్థ. ఇది ఉద్దేశపూర్వక అవినీతా లేక ప్రణాళికా లోపమా? అని చట్టబద్ధంగా నిర్ధారించడానికి పూర్తిస్థాయి విచారణ అవసరం. ఈ ఆరోపణలు, కాగ్ నివేదిక ఆధారంగానే అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు తదితర అంశాలపై విచారణ జరపడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అలాగే విజిలెన్స్ విభాగాలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.
శిక్ష పడాలంటే చేయాల్సినవి
పౌరులు కేవలం ఐదేళ్లకోసారి ఓటు వేయడంతో సరిపెట్టకుండా, ప్రజాధన దుర్వినియోగంపై క్షేత్రస్థాయిలో ప్రశ్నించే చైతన్యాన్ని పెంచుకోవడం అత్యంత ఆవశ్యకం. కాగ్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏసీబీ, సీఐడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో లేదా జ్యుడీషియల్ కమిషన్‌తో (జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌లాగా) విచారణ జరిపించాలి. కాంట్రాక్ట ర్ల వద్ద నుంచి డబ్బులు చేతులు మారాయ ని లేదా అధికార దుర్వినియోగం జరిగిందని దర్యాప్తు సంస్థలు పక్కా డాక్యుమెంట్లతో సాక్ష్యాలను సేకరించాలి. దర్యాప్తు సంస్థలు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలి. కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత, సమర్పించిన సాక్ష్యాధారాలు బలంగా ఉండి నేరం రుజువైతేనే న్యాయమూర్తి శిక్ష విధిస్తారు.
రాజకీయ పార్టీలు మారినా, అధికారంలో ఉండే ఆధిపత్య వర్గాలు తెరవెనుక ఒప్పందాలతో పన్ను చెల్లింపుదారుల సొమ్మును పణంగా పెడుతున్నాయి. పార్టీలకతీతంగా సాగే ఈ ఆధిపత్య రాజకీయాన్ని ఎదుర్కొని ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, పౌర సమాజ వేదికలు ప్రభుత్వ నిర్ణయాలను నిరంతరం ప్రశ్నించాలి. జనాభా నిష్పత్తికి అనుగుణంగా చట్టసభల్లో అన్ని వర్గాలకు రాజకీయాధికారం దక్కినప్పుడే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం లభిస్తుంది. తెలంగాణను అప్పులపాలు చేసిన నిర్ణయాలకు నైతికంగా పాలకులు బాధ్యత వహించాల్సిందే. అంతిమంగా, పారదర్శకమైన పాలన, ప్రజాస్వామ్యబద్ధమైన నిఘా ద్వారా మాత్రమే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోగలం.
వ్యాసకర్త: ఓబీసీ ఇంటలెక్చువల్
ఫోరమ్ కన్వీనర్, 9177566741
డా.పర్వతం వెంకటేశ్వర్






