20-02-2026 12:00:00 AM
చట్టవిరుద్ధ జీఓ 55 ను రద్దు చేయాలని పిటిషనర్ వినతి
మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయండి
సర్కార్లకు ఉన్నత న్యాయస్థానం ఆదేశం
హైదరాబాద్,సిటీ బ్యూరో ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి విభజిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 55పై తెలంగాణ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్లు మూడు వారాల్లోగా దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. జనగణన-2027 ప్రక్రియ నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై ఆంక్షలు అమల్లో ఉన్న తరుణంలో ఈ విభజన చేపట్టడం చట్టవిరుద్ధ మని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది.
ఆంక్షల వేళ విభజన ఎలా..
జీహెచ్‌ఎంసీ పునర్విభజనను సవాల్ చేస్తూ దరం గురువారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిష నర్ తరఫున అడ్వొకేట్ రాజ్‌కుమార్ గుమ్మి వాదనలు వినిపిస్తూ.. దేశవ్యాప్తంగా జనగణన-2027 కోసం జ్యూరిడిక్షన్ ఫ్రీజ్ అమల్లో ఉందని కోర్టుకు వివరించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు లేదా మున్సిపాలిటీల సరిహద్దులను మార్చడానికి వీల్లేదని పేర్కొన్నారు.
జీవో 55ను రద్దు చేయాలి
జనగణన నేపథ్యంలో ఏవైనా సరిహద్దు మార్పులు చేపట్టాలంటే 31 డిసెంబర్ 2025లోపే పూర్తి చేయాలని కేంద్రం గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసిన విషయా న్ని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 2027 మార్చి 31 వరకు ఎటువంటి రెవెన్యూ సరిహద్దులను మార్చడానికి వీల్లేదని నిషేధం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 11, 2026న జీవో 55ను జారీ చేయడం చట్టవిరుద్ధమని వాదించారు. అధికార పరిధిని అతిక్రమించి జారీ చేసిన ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.
జనగణన గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో..
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ వంటి హిమాలయ ప్రాంతాల్లో 2026 అక్టోబర్ నుంచి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 2027 మార్చి 1నుంచి జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ముగిసే వరకు సరిహద్దుల మార్పుపై ఆంక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోంది. సరిగ్గా ఈ ఆంక్షల కాలంలోనే జీహెచ్‌ఎంసీని విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ కేసులో తుది నిర్ణయం వెలువడనుంది.