20-02-2026 12:00:51 AM
హైదరాబాద్,సిటీ బ్యూరో ఫిబ్రవరి 19 (విజయక్రాంతి):దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.13,000 కోట్ల భారీ జీఎస్టీ ఎగవేత మోసాన్ని హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలి జెన్స్ అధికారులు రట్టు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ ముసుగులో జరుగుతున్న ఈ భారీ కుంభకోణానికి సంబంధించి యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ గేమింగ్ సంస్థ డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను జీఎస్టీ నిఘా విభాగం అధికారులు అరెస్ట్ చేశారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని, ఆర్థిక వ్యవస్థకు గండి కొడుతున్న ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు గుట్టును అధికారులు విప్పారు. టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లతో చేతులు కలిపి, చట్టవిరుద్ధంగా ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లను నిర్వహిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
నకిలీ కేవైసీలు.. షెల్ కంపెనీల నెట్‌వర్క్
ఈ కుంభకోణంలో నిందితులు అనుసరించిన తీరు అధికారులను విస్తుపోయేలా చేస్తోంది. అక్రమంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్ల నుంచి వచ్చే నగదు ప్రవాహాన్ని మళ్లించేందుకు వీరు షెల్ కంపెనీల సహాయం తీసుకున్నారు. ఇందుకు అవసరమైన నకిలీ కేవైసీ వెరిఫికేషన్లను పంకజ్ కుమార్ సంస్థ సిద్ధం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పేమెంట్ గేట్‌వేలు, బీఏపీఏ (బ్యాంకింగ్ ఆస్ పేమెంట్స్ అగ్రిగేటర్) వ్యవస్థలతో ఈ సంస్థకు లోతైన సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వస్తున్న కోట్ల రూపాయల అక్రమ ఆదాయాన్ని వైట్ మనీగా మార్చుకునేందుకు వీరు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. ఈ సిండికేట్‌లో పంకజ్ కుమార్‌ను అధికారులు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు.
ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లకు నగదు చెల్లించేందుకు అవసరమైన యూపీఐ ఇంటిగ్రేషన్ ప్రక్రియలో షెల్ కంపెనీలను చేర్చుకోవడంలో అతను కీలకంగా వ్యవహరించాడు. ఈ అక్రమ మార్గాల ద్వారా లభించిన వేల కోట్ల రూపాయల ఆదాయంలో పంకజ్ కుమార్ కూడా ఒక ప్రధాన లబ్ధిదారుడని జీఎస్టీ నిఘా విభాగం నిర్ధారించింది. దీనికి సంబంధించి ఫిన్‌టెక్ కంపెనీల సహాయంతో సాగించిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు పూర్తి ఆధారాలుసేకరించారు.
లోతైన విచారణ
హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్లపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అణచివేత చర్యలను ప్రారంభించింది. పంకజ్ కుమార్ అరెస్టుతో పాటు, సదరు సంస్థకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు 100 కోట్ల నగదును అధికారులు తక్షణమే ఫ్రీజ్ చేశారు.
ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? ఏయే ఫిన్‌టెక్ సంస్థలు వీరికి సహకరించాయి? అనే కోణంలో లోతైన విచారణ కొనసాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తు న్న ఇటువంటి ఆన్‌లైన్ గేమింగ్ మాఫియాపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటా మని జీఎస్టీ అధికారులు స్పష్టం చేశారు.