28 May, 2026 | 4:52 PM

కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి

28-05-2026 03:12 PM

బోధన్ మే 28 (విజయ క్రాంతి): నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతిని పురస్కరించుకుని బోధన్ పట్టణంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కమ్మ సంఘం అధ్యక్షులు  శివ నారాయణ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా శివ నారాయణ  మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ అని, సినీ రాజకీయ రంగాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జయంతి వేడుకల్లో భాగంగా వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. కోటగిరి మండలం మరియు పరిసర గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు తెలియజేశారు.