భారత్‌లో 576 మంది బిలియనీర్లు!
- ఒక్క ఏడాదిలోనే పెరిగిన 161 మంది బిలియనీర్లు
- వీరికి ఏటా రూ.100 కోట్లకుపైగా వార్షిక ఆదాయం
- గతేడాదిలో అపరకుబేరుల సంఖ్య 415
- గత ఐదేళ్లలో 300% వృద్ధి!
- 2025 గణాంకాలను వెల్లడించిన కేంద్రం
- ‘బిలియనీర్’కు అధికారిక నిర్వచనం ఏదీ లేదు
- కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి
న్యూఢిల్లీ, జూలై 29: భారత దేశంలో అపర కుబేరుల సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతున్నది. దేశంలో ఒక్క ఏడాదిలోనే 161 మంది బిలియనీర్లు అయ్యారు. ఏడాదికి రూ.100 కోట్లు, అంతకు పైగా ఆదాయం పొందుతున్న వారి సంఖ్య 2025 మదింపు సంవత్సరానికి 576కి చేరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత మదింపు సంవత్సరంలో ఈ సంఖ్య 415గా నమోదైందని, ఇది గత ఐదేళ్లలో 300 శాతం వృద్ధి చెందిదని తెలింది. 2021 పోల్చుకుంటే నాలుగురెట్లు పెరిగిందని పేర్కొంది. 2021- సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 142 మాత్రమే ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య పెరగడం దేశంలో ఆర్థిక వర్గీకరణలో మార్పులను సూచిస్తోంది. అయితే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ‘బిలియనీర్’ అనే పదానికి అధికారికంగా ఎలాంటి నిర్వచనం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు.
అందువల్ల, రూ.100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్నవారిని అత్యధిక ఆదాయం కలిగిన వర్గంగా పరిగణించి ఈ వివరాలు అందిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, అసెస్మెంట్ ఇయర్ (ఏవై) 2025 రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని పేర్కొన్న వ్యక్తుల సంఖ్య 576కి పెరిగింది. ఏవై 2024- ఇదే సంఖ్య 415గా ఉంది. అంటే దేశంలో ఒక్క ఏడాదిలోనే 161 మంది బిలియనీర్లుగా ఎదిగారు.
పార్లమెంట్‌లో సోమవారం అడిగిన దేశంలో బిలియనీర్ల సంఖ్యలో పెరుగుదలను ప్రభుత్వం గమనించిందా అనే ప్రశ్నకు సమాధానంగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ గణాంకాలను అందించారు. సంపద పన్ను చట్టం-1957ను 2016 ఏప్రిల్ 1న రద్దు చేసినందున, వ్యక్తుల మొత్తం సంపదపై తమ వద్ద అధికారిక డేటా ఏదీ లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో, దేశంలో కుబేరు ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వారి నిజమైన సంపదపై పూర్తి సమాచారం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అసమానతలపై కూడా స్పందిం చింది.
2023- కుటుంబ వినియోగ వ్యయ సర్వే (హెచ్‌సీఈఎస్) ప్రకారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అసమానతలను సూచించే గిని కోఎఫిషెంట్ తగ్గిందని పేర్కొంది. 2022లో నిరుద్యోగిత రేటు 3.6 శాతం నుంచి 2025 నాటికి 3.1 శాతానికి పడిపోయిందని ప్రభుత్వం వెల్లడించింది. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం.. 2013 నుంచి 2022- మధ్య దాదాపు 24.82 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది.
ఈ నేపథ్యంలో, అధిక ఆదాయం ఉన్న వారిపై అదనపు సర్‌చార్జి విధించడం వంటి చర్యలతో పాటు, పీఎం ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాల ద్వారా అసమానతలను తగ్గించేందుకు కేంద్రం కృషి చేస్తున్నది. అయితే, దేశంలో అధిక ఆదాయం ఆర్జించే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ, వారి నిజమైన సంపదపై పూర్తి సమాచారం లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.
గత ఐదేళ్లలో కుబేరుల సంఖ్య ఇలా..
ఐటీఆర్‌లో స్థూల ఆదాయాన్ని ప్రకటించిన వ్యక్తులను ప్రభుత్వం లెక్కించి కుబేరుల సంఖ్యను వెల్లడించింది. 2021 142 మంది, 2022 205, 2023 395, 2024 415, 2025 ఈ సంఖ్య 576కు పెరిగింది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందనేందుకు ఈ సంపద సృష్టి ఒక నిదర్శనం, సంకేతంగా చెప్పుకోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. కుబేరుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వానికి పన్నుల రాబడి కూడా పెరుగుతుంది. దీంతో మౌలిక సదుపాయాలు, సామాజిక కార్యక్రమాలు, మూలధన వ్యయాల కోసం ప్రభుత్వం వినియోగించుకోనుంది.






