6 May, 2026 | 3:14 AM

నర్సింగ్ విద్యార్థులు సేవాభావంతో ముందుకు సాగాలి

06-05-2026 01:49 AM

జిల్లా ప్రతిష్టను నిలబెట్టేలా విద్యార్థులు పనిచేయాలి

ఘనంగా నర్సింగ్ కళాశాల విద్యార్థుల వీడ్కోలు

ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే

గద్వాల టౌన్, మే 5: నాలుగేళ్ల పాటు చదివి బీఎస్సీ నర్సింగ్ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించాక సేవాభావం, సహానుభూతి, మానవత్వంతో కూడిన సేవలను రోగులకు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గద్వాలలోని అనంత ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ నెల 12న ప్రపంచంలో మొదటి నర్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పరిష్కరించుకొని నిర్వహించే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి బ్యాచ్గా నర్సింగ్ విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని వెళ్లడం సంతోషంగా ఉందని, వారందరూ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

కళాశాలలో మొత్తం 87 మంది విద్యార్థులు నర్సులుగా కోర్సు పూర్తి చేస్తున్నందున ఈ సందర్భంగా కలెక్టర్ సహకరించిన వారి తల్లిదండ్రులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను అభినందిస్తూ వారి కృషిని ప్రశంసించారు. ఆసుపత్రుల్లోనే కాక దీర్ఘకాలికంగా వివిధ వ్యాధులతో బాధపడే వారికి, వయోవృద్ధులకు, చిన్నారులకు వారి ఇండ్ల వద్ద కూడా సేవలందించేందుకు నర్సులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని రోగుల మానసిక పరిస్థితులకు అనుగుణంగా సేవలు అందిస్తే మంచి పేరు తెచ్చుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆరోగ్య సేవల్లో నర్సింగ్ పాత్రకు ఎలాంటి లోటు ఉండదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ వృత్తికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.