30 May, 2026 | 2:07 AM

పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి పోషకాహారం కీలకం

30-05-2026 12:30 AM
  1. జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి
  2. తొలి 1000 రోజులు శిశువుకు ఎంతో ప్రాముఖ్యం
  3. గర్భిణులు, బాలింతలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  4. మహిళా వారోత్సవాల్లో అంగన్వాడీల ఆటబొమ్మల వినూత్న ప్రదర్శన

రంగారెడ్డి, మే 29(విజయక్రాంతి): 99 రోజుల ప్రజాపాలన  ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు మరియు తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ డా. కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. తల్లిదండ్రుల సంరక్షణే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు మూలమని, లోపపోషణ వల్ల పిల్లల అభివృద్ధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ప్రతి కుటుంబం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.శిశువు జీవితంలో తొలి 1000 రోజుల ప్రాముఖ్యత, తల్లిపాలు, అనుబంధ ఆహారం మరియు పోషకాహార సంరక్షణకు సంబంధించిన ఆరు మూల స్తంభాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

అనంతరం ఇంటి వద్ద లభించే వ్యర్థ పదార్థాలతో తక్కువ ఖర్చుతో పిల్లల అభివృద్ధికి ఉపయోగపడేలా తయారు చేసిన ఆటబొమ్మలు, విద్యా సామగ్రి ప్రదర్శనను ఆమె తిలకించారు. వినూత్నమైన బొమ్మలు తయారు చేసిన అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులను ప్రశంసిస్తూ ఆమె బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది మరియు ప్రథమ్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.