ఉపాధి హామీ పనుల పరిశీలన
కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ అర్బన్, మే 29 (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల నిర్వహణపై హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఉపాధి హామీ పనులకు ప్రతిరోజు ఎంతమంది కూలీలు వస్తున్నారని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఉపాధి హామీ పని ప్రదేశం వద్ద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో క్షేత్రస్థాయిలో కల్పిస్తున్న సౌకర్యాలను గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఉపాధి హామీ పనులకు 480 మంది కూలీలు హాజరవ్వడంపై, ఉపాధి హామీ కూలీలకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిన తాగునీరు, టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తదితర వసతులు కల్పించడం పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు వేగంగా జరుగుతుండడం పై డిఆర్డిఓ మేన శ్రీను, కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు, ఈజీఎస్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఉప్పల్ గ్రామ సర్పంచ్ రమా, తహసిల్దార్ సురేష్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.






