30-09-2025 12:25:13 PM
శామీర్ పేట్: ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు నిర్మించ తలపెట్టిన 18 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌కు(Elevated corridor) అడుగడుగునా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్(ఫ్లైఓవర్‌బ్రిడ్జి) నిర్మాణానికి సంబంధించి 2 వందల అడుగుల వెడల్పైన రోడ్డు అవసరమని అధికారులు గుర్తించారు. అందుకోసం అవసరమైన భూసేకరణ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. నోటీసులు అందుకున్న వారు భూసేకరణ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కారిడార్ నిర్మా ణం(Corridor construction) 200 అడుగుల వెడల్పుతో కాకుండా 120 అడుగుల వెడల్పుతోనే సరిపెట్టాలని కోరుతున్నారు. ఈ విషయంపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ గత కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం పత్రికలో రోడ్డు విస్తీర్ణకు అంతా సిద్ధం అని పత్రిక ప్రకటన ఇవ్వడంతో మున్సిపాలిటీ ప్రజలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్డు విస్తీర్ణంలో నష్టపోతున్న బాధితులు భూమికి బదులుగా భూమిని ఇచ్చి ప్రస్తుత వ్యాపార సముదాయంలో పనిచేస్తున్న ఆస్తి కోల్పోతున్న కుటుంబాలను తగిన నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం తమను చర్చలకు పిలిచి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.