13 June, 2026 | 2:33 AM

తాలిపేరు ఎడమ కాల్వలోని అడ్డంకులు తొలగించాలి

13-06-2026 01:27 AM

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ అంకిత్

భద్రాచలం, జూన్ ౧౨ (విజయక్రాంతి): దుమ్ముగూడెం మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి తాళిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువతో పాటు దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సాగునీటి సరఫరా, వైద్య సేవల నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

మొదటగా వీరభద్రపురం గ్రామం పరిధిలోని తాళిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను పరిశీలించిన కలెక్టర్, కాలువ పరిస్థితులు, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాళిపేరు ప్రాజెక్టు ద్వారా సుమారు 24,700 ఎకరాల భూమికి సాగునీరు అందుతుండగా, ఎడమ కాలువ 46.46 కిలోమీటర్ల పొడవుతో 34 డిస్ట్రిబ్యూటరీల ద్వారా సుమారు 21,100 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

కాలువలో పెరిగిన గడ్డి, చెత్త, పూడికను వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు సాగునీరు సకాలంలో అందేలా కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయకట్టు చివరి భూముల వరకు నీరు చేరేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అనంతరం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆరోగ్య కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవల నిర్వహణపై సమగ్రంగా ఆరా తీశారు.

ఇన్పేషెంట్ వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు, సేవల నిర్వహణను పరిశీలించారు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చిన విద్యార్థులతో మాట్లాడి వారి వివరాలను తెలుసుకున్న కలెక్టర్, ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీకి అనుసరిస్తున్న విధానంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఔషధ నిల్వల గదిని పరిశీలించి మందుల నిల్వలు, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను తనిఖీ చేశారు.   ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సత్వర వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ అశోక్ కుమార్ ఇరిగేషన్ ఈ ఈ జానీ, డాక్టర్ రుక్మాకర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.