16 April, 2026 | 2:00 AM

మల్లన్నసాగర్ ఒంటరి బాధితులకు న్యాయం

16-04-2026 12:00 AM

హైకోర్టు ఆదేశాలతో ఖాతాల్లో డబ్బు జమ చేసిన అధికారులు

గజ్వేల్, ఏప్రిల్ 15: మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలకు చెందిన ఒంటరి మహిళలు, మగవారికి న్యాయం కోసం సాగిన దీర్ఘకాల న్యాయపోరాటానికి ఎట్టకేలకు ఫలితం లభించింది. ఒంటరి మహిళలు మగవారి మల్లన్నసాగర్ ప్యాకేజీల కోసం 2019 జులై 10వ తేదీన వేములఘాట్కు చెందిన 52 మంది, 2021మార్చి నెలలో కిష్టాపూర్కు చెందిన 27 మంది కలిసి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో 2023 నవంబర్ 10వ తేదీన  హైకోర్టు చట్ట ప్రకారం పూర్తి ముంపు ప్యాకేజి ప్రయోజనాలను 4 నెలల్లో అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నిర్ణీత గడువులో అమలు జరగకపోవడంతో, వేములఘాట్  కిష్టాపూర్  2024లో కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2025 జులై లో న సంబంధిత అధికారులందరికి  వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా ఒకరిని మినహాయించి మిగతా అధికారులందరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించడంతో, అధికారులు మధ్యాహ్నం కోర్టుకు హాజరై 6 వారాల్లో చెల్లింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

దాంతో కోర్టు ధిక్కరణ కేసులను తాత్కాలికంగా ముగించింది. అయినా ఇవ్వకపోవడం తో డిసెంబర్ 2025లో పిటిషన్ వేశారు. టైమ్ తీసుకుంటూ దాట వేస్తున్నారని, 15 ఏప్రిల్ 2026 రోజు ఫైనాన్స్ సెక్రెటరీ నేరుగా కోర్టుకు హాజరై ఎందుకు ఇవ్వడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించగానే, మంగళవారం  సాయంత్రం కేసు వేసిన వారిలో బ్రతికి ఉన్న బాధితుల అకౌంట్ లలో రూ.12,54,000/- చొప్పున అధికారులు జమ చేశారు. తమకు న్యాయం జరగడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ  తమ కోసం సంవత్సరాలుగా పోరాడుతున్న  న్యాయవాది  రవికుమార్ ను హైకోర్టులో ఘనంగా సన్మానించారు.