వామ్మో.. విద్యా శాఖ!
- విద్యాశాఖ అంటేనే నేతల్లో వణుకు
- పదవి చేపట్టేందుకు వెనుకడుగు
- జెన్ జీ ఉద్యమాలతో భయం
- పంజాబ్, రాంచీ ఘటనలతో మరింత గుబులు
- ప్రభుత్వం మేల్కొనాల్సిన సమయం
- పేపర్ లీక్‌లపై ముందస్తు కార్యాచరణ అవసరం
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి) : వామ్మో.. విద్యా శాఖ! ఒకప్పుడు ఈ శాఖను కీలకంగా భావించిన రాజకీయ నాయకులు.. ఇప్పుడు ఆ శాఖ అంటేనే వణికిపోతున్నారు. జెన్ జీల ఉద్యమాలు, విద్యార్థుల ఆందోళనలు నేతల్లో కొత్త భయాలను రేకిత్తుస్తున్నాయి. ఢిల్లీ ఘటనల తర్వాత పంజాబ్, రాంచీలోనూ నిరసనలు ఉధృతం కావడంతో విద్యాశాఖ బాధ్యతలు చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది.
జెన్ జీల టార్గెట్ విద్యాశాఖనే..
దేశంలో జరుగుతున్న వరస సంఘటనలు చూస్తుంటే విద్యా శాఖనే జెన్ జీల లక్ష్యమని స్పష్టమవుతోంది. నీట్ ప్రశ్న పత్రం లీక్‌పై ఢిల్లీలో జెన్‌జీలు చేసిన నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీనికి ఒక్క బీజేపీ మినహా అన్ని పార్టీలు మదతిచ్చాయి. ఆ వెంటనే పంజాబ్‌లో ఫార్మసీ ఆఫీసర్ పరీక్ష పత్రం లీకేజీపై యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. దీనికి బీజేపీతో సహా పలువురు మద్దతు తెలిపారు.
ఆ వెంటనే జార్ఖండ్‌లోని రాంచీలో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ జెన్ జీలు రోడ్లపైకి వచ్చారు. కొద్ది రోజులుగా అక్కడ నిరససనలు మిన్నంటుతున్నాయి. తాజాగా ప్రభుత్వం నిరసనకారులతో చర్చలు కొనసాగిస్తోంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కంతా జార్ఖండ్‌లో విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు రాష్ట్ర సీఎం కావడం.
నిప్పుతో చెలగాటమే!
దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసుకున్నా.. విద్యా శాఖను నిర్వహిస్తున్న మంత్రులందరూ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతోనే వెల్లదీస్తున్నారు. కొత్తగా విద్యా శాఖను ఎవరికి అప్పగించాలని చూసినా.. అది తప్పితే వేరే ఏ శాఖ అయినా ఫరవాలేదనే స్థితికి వచ్చింది. విద్యా శాఖ అంటేనే ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. ప్రజా ప్రతినిధులు, అలాగే ప్రభుత్వాలుకూడా విద్యా శాఖను నిర్వహించడం ఇప్పుడు ఆషామాషీ వ్యవహారం కాదనే స్థాయికి వచ్చింది.
దీనితో విద్యా శాఖ అంటే.. నిప్పుతో గోక్కోవడమే అనే దృష్టితో సాగుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రశ్నాపత్రం లీక్ అయినా.. ఎలాంటి ఉద్యోగ భర్తీ ప్రక్రియలో లొసుగులు బయటపడ్డా.. వెంటనే విద్యా శాఖా మంత్రివైపే అందరి దృష్టి మళ్ళుతోంది. పైగా చాలా రాష్ట్రాల్లో విద్యా శాఖను ముఖ్యమంత్రులే చూస్తుండటంతో.. వారిలోనూ ఉలికిపాటు మొదలయ్యిందనే చెప్పవచ్చు. దీనితో కొత్తగా ఎవరికి అప్పచెప్పుదామని అనుకున్నా.. నేతలు ఒకడుగు వెనకేస్తున్నారు. మాకు విద్యా శాఖ వద్దు మహా ప్రభో అంటున్నారు.
తెలంగాణలోనూ అదే..
తెలంగాణలో కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇక్కడ కూడా విద్యా శాఖను ముఖ్యమంత్రే చూస్తున్నారు. దీనితో రాజకీయ నేతల్లో అలజడి మొదలయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి లీకేజీలు అయినా.. విద్యా శాఖపైనే పెను ప్రభావం చూపుతోంది. దీనితో విద్యా శాఖను ఎవరికి ఇచ్చినా.. అంత సుముఖంగా తీసుకునే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలోనే ముందస్తుగా కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలు జరిగినా.. అందుకు బాధ్యులను, వారికి శిక్షలను ముందుగానే నిర్దేశించుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కఠిన చట్టాలు అవసరం
ఇప్పటికే కేంద్రం కఠిన చట్టాలను తీసుకొచ్చింది. ఇదే మార్గంలో రాష్ట్రంకూడా నడవాల్సి ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. వాస్తవానికి లీకేజీల వ్యవహారాల్లో నేరుగా మంత్రుల ప్రమేయం అనేది ఉండదు. కానీ, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడమనేది జెన్‌జీల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్ నేపథ్యంలో.. ఎక్కడ ఎలాంటి తప్పొప్పులు జరిగినా.. అందుకు బాధ్యులు, వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ముందుగానే చట్టం రూపంలో నిర్దేశించుకోవాలని వారంటున్నారు.
ఇలా చేయడం వల్ల ఎలాంటి లీకేజీలు జరిగినా.. వెంటనే చట్ట ప్రకారం బాధ్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవడం, కఠినంగా శిక్షలు వేయడం లాంటివి చేస్తే.. జెన్‌జీల నిరసనలు ఉండవు. అదికాస్తా విద్యా శాఖా మంత్రుల మెడకు చుట్టుకోకుండా ఉంటుందనే సూచనలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా కఠిన చట్టాల ఏర్పాటుపై దృష్టి సారించాలని, తద్వారా బాబోయ్ విద్యా శాఖనా అనే భయం ఉండదని వారంటున్నారు. ఇలా బాధ్యతలు ముందుగానే నిర్దేశించడం, ఆపై చర్యలు, కఠిన శిక్షలను చట్ట రూపంలో తేవడం ద్వారా.. కిందస్థాయిలో ఇలాంటి అక్రమాలకు పాల్పడేం దుకు జంకుతారని, దీనితో విద్యా శాఖపై నమ్మకం ఉంటుందని.. అన్నింటికంటే ఎక్కువగా విద్యా శాఖ మంత్రిపై రాకుండా ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.






