ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రం ప్రారంభం
కేసముద్రం, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత ప్రారంభించారు. కేసముద్రం ప్రాంతంలో ఆయిల్ పామ్ పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి ఆయిల్ ఫెడ్ సంస్థ, జిల్లా ఉద్యాన శాఖ అధికారుల చొరవ మేరకు కేసముద్రం మార్కెట్ యార్డులో ప్రతి నెల ఒకరోజు ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతుల నుంచి గెలలు సేకరించి వారికి డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని తెలిపారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ఐలుమల్లు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న, ఆయిల్ ఫెడ్ ఇంచార్జ్ దయాకర్, తహసిల్దార్ వివేక్, మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు, ఏవో వెంకన్న, ఉద్యాన శాఖ అధికారి ప్రియదర్శిని, కేసముద్రం మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.






