16 August, 2026 | 4:33 AM

ఇందిరాభవన్‌లో ‘జాతీయ గీత’ వివాదం

16-08-2026 12:11 AM
  1. ‘వందేమాతరం’ ప్లే అవుతుండగా సోనియా సంజ్ఞలు
  2. సోషల్ మీడియాలో వీడియో వైరల్
  3. సోనియా గీతాన్ని ఆపేయాలని సూచించారంటూ బీజేపీ శ్రేణులు ఫైర్
  4. గీతాలాపనపై కాంగ్రెస్‌కు పట్టింపు లేదని విమర్శలు
  5. ఖర్గే కోసం కుర్చీ పురమాయించిన సమయంలోనే సంజ్ఞలు: కాంగ్రెస్

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౫: ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం (ఇందిరా భవన్)లో శనివారం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఓ వివాదాస్పద పరిణామం చోటుచేసుకున్నది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరిం చిన తర్వాత వేదిక వద్ద వందేమాతర గీతం ప్లే అవుతుండగా, పార్టీ అగ్రరాయకురాలు సోనియాగాంధీ చేతితో చేసిన సంజ్ఞలు, అయిష్టంగా అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖకవలికలు ఉండటమే అందుకు కారణం.

ఆ సంజ్ఞలకు సంబంధించిన వీడియో, ఫొటో లో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఆమె కావాలనే గీతాన్ని నిలిపివేయాలని సూచించినట్లు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ‘వందేమాతర గీతానికి చట్టబద్ధత కల్పించిన వేళ.. యావత్ దేశమంతా భక్తిశ్రద్ధలతో ఆలపిస్తున్నది. కానీ.. ఇందిరా భవన్‌లో గీతం ప్లే అవుతుండగా సోనియాగాంధీ ఆపేయాలని సూచించడమేంటి? జాతీయ గీతాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు సైగలు, సంజ్ఞలు చేసుకోవడం,

ముచ్చట్లు పెట్టుకోవడాన్ని చూస్తే గీతం పట్ల కాంగ్రెస్ వైఖరేంటో తెలిసిపోతుంది’ అంటూ విమర్శలు గుప్పించాయి. ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సోనియాగాంధీ వందేమాతర గీతాన్ని ఆపేయాలని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపడే సింది. ఖర్గే కొన్ని గంటల పాటు నించునే ఉండటంతో సోనియా చొరవ తీసుకుని, ఆయన కోసం కుర్చీ తీసుకురావాలని ఆమె సంజ్ఞలతో సూచించారని స్పష్టం చేసింది.

గీతానికి మా వల్లే గుర్తింపు: జైరాం రమేశ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మీడియా జాతీయ గీత వివాదంపై మీడియా ద్వారా స్పందించారు. ‘ఇందిరా భవన్‌లో చోటుచేసుకున్న పరిణామం ఒకటైతే, సోషల్‌మీడియాలో మరో అంశంపై నడుస్తున్నది’ అని వాపోయారు. వందమాతరం గీతాన్ని ఆపేయాలని సోనియాగాంధీ సూచించలేదని, ఖర్గే కోసం కుర్చీ పురమాయించే సమయంలో ఆమె చేసిన సంజ్ఞలపై బీజేపీ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి, వివాదం సృష్టించి జనాల దృష్టిని మళ్లించే పనిలో ఆ పార్టీ ఉందని విమర్శించారు.

అసలా.. గీతాన్ని జాతికి అంకితం చేసిందే కాంగ్రెస్ అని, తమ పార్టీ అంకిత భావమేం టో యావత్ దేశ పౌరులందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, అబుల్ కలాం ఆజాద్, నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్, సీ రాజగోపాలాచారి వంటి స్వాతంత్య్ర సమరయోధులు ఆ గీతాన్ని ఆలపించి జాతికి అంకితం చేసినట్లు గుర్తుచేశారు. అలాంటి, కాంగ్రెస్ పార్టీ జాతీయ గీతాన్ని అవమానించిందని బీజేపీ ప్రచారం చేయడం హాస్యాస్ప దమని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలకు గీతం చరిత్ర గురించి ఏమాత్రం తెలియదని వ్యాఖ్యానించారు.