2 September, 2026 | 11:28 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

భయంతో బిక్కుబిక్కుమంటూ విమాన రెక్కలపై..

15-03-2025 | 12:16am
  • అమెరికాలో విమానంలో చెలరేగిన మంటలు
  • ప్రాణభయంతో విమానం రెక్కల మీద నిల్చున్న ప్రయాణికులు
  • తృటిలో తప్పిన పెను ప్రమాదం

డెన్వర్, మార్చి 14: అమెరికాలో తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. కొలరాడో స్ప్రింగ్స్ అంతర్జాతీయ విమానా శ్రయం నుంచి డల్లాస్ ఫోర్ట్ వర్త్‌కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానంలో ఏర్పడ్డ సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయి. గాలిలో ఉండగానే.. ఇంజిన్‌లో వైబ్రేషన్స్‌ను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని డెన్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.

విమానం కిందికి దిగిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది అందులో ఉన్న ప్రయాణికులను అత్యవసర ద్వారాల గుండా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రయాణికులు విమాన రెక్కల మీద నిల్చొని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఎమర్జెన్సీ ద్వారాల ద్వారా బయటకు వచ్చిన ప్రయాణికులు విమానం రెక్కలపై నిల్చున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.

విమానంలో ఉన్న ప్రయాణికుల్లో 12 మంది ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలవగా.. ఆసుపత్రికి తరలించినట్లు డెన్వర్ విమానాశ్రయ అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన సిబ్బందికి ధన్యవాదాలు’ అని విమానయాన సంస్థ ప్రకటించింది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు.