బాలకృష్ణతో మరోసారి..
నందమూరి బాలకష్ణను హీరోగా పెట్టి దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సినిమాను రూపొందిస్తున్నారు. బాలకష్ణ నటించనున్న 111వ ప్రాజెక్ట్ ఇది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా ప్రస్తుతం ‘ఎన్బీకే111’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పట్నుంచీ దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇదిలావుండగా, ఈ సినిమా గురించి దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ మధ్య ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది” అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్టులో బోల్డ్ బ్యూటీ లక్ష్మీ రాయ్ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా, టీమ్ ఇప్పుడు లక్ష్మీ రాయ్‌ని ఎంపిక చేసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె ఏ పాత్రలో కనిపించబోతోందని చర్చించుకుంటున్నారు.
ఆమె పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుందని.. మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలో లక్ష్మి రాయ్ అలరించ బోతోందని టాక్ వినవస్తోంది. అయితే, లక్ష్మీ రాయ్, బాలకష్ణ గతంలో ‘అధినాయకుడు’ అనే సినిమాలో కలిసి నటించారు. సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.




