25 June, 2026 | 4:14 PM

కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

25-06-2026 03:04 PM

భిక్కనూర్, జూన్ 25(విజయ క్రాంతి):  భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట నుంచి భిక్కనూర్ వైపు వస్తున్న ప్యాసింజర్ ఆటోను అదే దారిలో వెళ్తున్న కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్వాపూర్ గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బస్వాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.