25 June, 2026 | 3:44 PM

విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు

25-06-2026 03:09 PM

- ఏఈఓలకు సమాంతరంగా వ్యవసాయ డీలర్లను తీర్చిదిద్దడమే లక్ష్యం

- దేశి కోర్సులో భాగంగా క్షేత్ర సందర్శన నిర్వహణ

గజ్వేల్,( విజయ క్రాంతి): వ్యవసాయ విత్తన, ఫర్టిలైజర్ల డీలర్లను వ్యవసాయ విస్తరణ అధికారులకు సమాంతరంగా రైతులకు సాంకేతిక సలహాలు అందించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశి (డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్స్) కోర్సును నిర్వహిస్తున్నట్లు దేశి ఫెసిలిటేటర్ పి. శంకర్ రావు తెలిపారు.

మేనేజ్ (జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ) మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 48 వారాలపాటు నిర్వహిస్తున్న దేశి కోర్సులో భాగంగా మార్కెట్ మండలం ఎర్రవల్లి గ్రామంలో 4వ క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీలర్లకు వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శింపజేసి పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. 

క్షేత్ర సందర్శనలో భాగంగా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని కూడవెల్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం, ఫామ్ పాండ్, ఆయిల్ పామ్, అరటి తోటలను డీలర్లు సందర్శించారు. రైతులు రాజిరెడ్డి, సుధాకర్ రెడ్డి పంటల సాగులో అనుసరిస్తున్న విధానాలు, నీటి వినియోగం, పంటల నిర్వహణ తదితర అంశాలను వివరించి అవగాహన కల్పించారు. వ్యవసాయ రంగంలో డీలర్లు కేవలం ఎరువులు, పురుగుమందులు విక్రయించే వారిగానే కాకుండా రైతులకు సాంకేతిక మార్గదర్శకులుగా ఎదగాలని శంకర్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ బాలరాజు, డీలర్లు నర్సింలు, విఖిల్, కరుణాకర్, లింగం, భాస్కర్, బైరయ్య తదితరులు పాల్గొన్నారు.