25 June, 2026 | 4:50 PM

రేవంత్ రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ను బొంద పెట్టిండు: కేటీఆర్

25-06-2026 04:09 PM

చేవెళ్ల:  చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్‌ఐఆర్‌ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy), మాజీ ఎమ్మెల్యే  పట్నం నరేందర్ రెడ్డి , బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ ఇంద్ర రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.  ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రియల్‌ ఎస్టేట్‌ను బొంద పెట్టిండని కేటీఆర్ ద్వజమెత్తారు. ఒకప్పుడు కోట్లు పలికిన భూముల ధరలు పడిపోయాయని వెల్లడించారు. హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ రెడ్డి ఎగిరెగిరిపడుతున్నారని సూచించారు.

మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డిని ఏమనాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వివరించారు. రేవంత్ 72 సార్లు ఢిల్లీ పోయి 72 పైసలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) 2.80 లక్షల కోట్ల అప్పులు చేశారని లెక్క చెప్పారు.  అప్పు చేసి కేసీఆర్ ఎంతో అభివృద్ధి, సంక్షేమం చేశారని తెలిపారు. రెండేళ్లలో రేవంత్ రెడ్డి రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేశారని ఫైర్ అయ్యారు. ఇంత అప్పు చేసి సీఎం రేవంత్ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలకు ఏమీ చేయని రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి మాత్రం కుప్పం కడుతున్నారని ఎద్దేవా చేశారు.