8 July, 2026 | 9:15 PM

వంద శాతం అక్షరాస్యత సాధించాలి

11-06-2024 12:17 AM

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూన్ 10 (విజయక్రాంతి): మెద క్ జిల్లా వంద శాతం అక్షరాస్యత సాధించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాహు ల్ రాజ్ పిలుపునిచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న ‘న్యూ ఇండియా లిటరసీ’ కార్యక్రమంపై సోమవారం కలెక్టరేట్‌లో అధికా రులతో సమీక్షించారు. జిల్లాలో గతంలో ఉన్న అక్షరాస్యత కంటే మెరుగైన అక్షరాస్యత నమోదు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని అన్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని, మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.

కాగా, 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మధ్యాహ్న భోజన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు త్వరగా అందించాలని తెలిపారు. తాగునీరు, విద్యుత్ సమస్యలు ఉండొద్దని వివరించారు. కాగా, జిల్లాలో రైతులకు ఎరువుల కొరత లేదని, అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఈవో రాధాకిషన్ పాల్గొన్నారు.