18 July, 2026 | 12:31 AM

వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగుపై అప్రమత్తంగా ఉండాలి

18-07-2026 12:00 AM

వ్యవసాయ అధికారి అనూరాధ

మొయినాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ఎల్-నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, దీర్ఘకాలిక డ్రై స్పెల్ కార ణంగా మొయినాబాద్ మండలంలో భూగర్భ జలాల మట్టం తగ్గుతున్న నేపథ్యంలో రైతులు వరి సాగులో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ సూచించింది. మొత్తం సాగు విస్తీర్ణంలో వరి పంట వేయకుండా, నీటి లభ్యతను బట్టి కొంత మేర మాత్రమే వరి సాగు చేపట్టి, మిగిలిన భూమిలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి పి. అనూరాధ తెలిపారు.

ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో బోర్లలో నీటి లభ్యత తగ్గిపోవడంతో పాటు చెరువులు పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి కనిపించడం లేదన్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం చివరి దశలో కొంత వర్షపాతం నమోదైనా, నీటి వనరులు పూర్తిగా నిండే అవకాశాలు పరిమితంగానే ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో జొన్న, పెసలు, మినుములు, కంది, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆర్థిక నష్టాలను నివారించవచ్చని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సలహాలతో సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని పి. అనూరాధ విజ్ఞప్తి చేశారు.