ఏఐఆర్‌ఆర్‌ఎఫ్‌ను పునరుద్ధరించాలి
ఆర్పీఐ(ఏ) జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్
ముషీరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ఆలిండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్(ఏఐఆర్‌ఆర్‌ఎఫ్) కార్యాలయా న్ని పునరుద్ధరించి, రైల్వే బోర్డు తుది నిర్ణయం వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న కార్యాలయం(క్వార్టర్ నెం. 370/2 అండ్ 333/3, చిలకలగూడ)లో యథావిధిగా కొనసాగేందుకు అనుమతించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్ను కోరారు.
ఈ సందర్భంగా ఏఐఆర్‌ఆర్‌ఎఫ్ దక్షిణ మధ్య డివిజనల్ కార్యాలయానికి వేసిన తాళాలను వెంటనే తొలగించి అన్ని సౌకర్యాలను పునరుద్ధరించాలని, రైల్వే పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు గౌరవప్రదమైన సేవలు అందించాలని, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు కార్యాలయ ప్రాంగణంలోకి నిర్బంధం లేని ప్రవేశం కల్పించాలని, ఏఐఆర్‌ఆర్‌ఎఫ్ ప్రతినిధులపై వేధింపులు, వివక్షాపూరిత వైఖరిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యను సానుభూతితో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని, న్యాయం జరిగేలా చూస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్‌ఆర్‌ఎఫ్ కార్యాలయ బేరర్లు కేఎన్ స్వామి, ఎన్‌ఆర్సీ రాజు, అనిల్ కుమార్, శివకుమార్, జైరాం, పీఆర్వో టి.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.






