భరోసా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్,(విజయక్రాంతి): మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచారాలు, POCSO కేసుల బాధితులకు సమగ్ర సహాయం అందించేందుకు భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల తెలిపారు. బాధితులకు వైద్య, న్యాయ, మానసిక, పునరావాస, ఆర్థిక సహాయాన్ని ఒకే వేదికపై అందించే విధంగా భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. భరోసా కేంద్రం ద్వారా బాధితులకు మెడికో-లీగల్ పరీక్షలు, కౌన్సిలింగ్, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం, పునరావాస సేవలు అందించబడతాయని తెలిపారు.
అలాగే POCSO మరియు అత్యాచార కేసుల బాధితులకు ప్రభుత్వం కల్పించే పరిహారం (Compensation) అందించేందుకు జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA), పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో చర్యలు చేపడతారని వివరించారు. కేసుల దర్యాప్తులో దర్యాప్తు అధికారులు బాధితుల హక్కులను పరిరక్షిస్తూ, చట్ట ప్రకారం నిర్దేశించిన గడువుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు. బాధితులకు పరిహారం, న్యాయ సహాయం, పునరావాసం వంటి సేవలు అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని ఆదేశించారు.
అలాగే జిల్లా విద్యాశాఖ, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs), మున్సిపల్ పరిధిలోని మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (MEPMA), జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ (DCPU), బాలల సంక్షేమ కమిటీ (CWC), జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB), సఖీ కేంద్రం తదితర సంస్థలు మహిళలు, చిన్నారుల రక్షణ మరియు పునరావాస కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నాయని తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు భయపడకుండా పోలీసులను, భరోసా కేంద్రాలను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ సూచించారు.






