26 June, 2026 | 1:47 AM

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

26-06-2026 12:00 AM

కలెక్టర్ ఆశిష్ సంగువాన్ 

కామారెడ్డి, జూన్ 25 (విజయక్రాంతి): మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. గురువారం కామారెడ్డిలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు.

జిల్లా పరిపాలన, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, పాల్గొని మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే పరిణామాలను ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు మూల స్తంభం అని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతారని అన్నారు. యువత మారకద్రవ్యాల బారిన పడవద్దు అని సూచించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు  పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలను చేపట్టిందన్నారు. మత్తు  పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.

మాదకద్రవ్యాల సంబంధించిన సమాచారాన్ని తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాజ సహకారంతోనే మాదకద్రవ్యాల నియంత్రణ రహిత జిల్లాగా కామారెడ్డిని తీర్చిదిద్దగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ వి గిరి, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ప్రసన్న, ఎక్సైజ్ సూపర్డెంట్ హనుమంతరావు, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.