ఏకపక్షంగా భారత్ చరిత్ర చిత్రీకరణ
- దేశప్రజలంతా ఐక్యత కొనసాగించాలి
- మహారాణా ప్రతాప్ జయంతి వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
జైపూర్, జూన్ 18: చాలా కాలంగా భారతదేశ చరిత్రను ఏకపక్షంగా చిత్రీకరిస్తున్నారని, కానీ వాస్తవం భిన్నంగా ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశంలో ఒక పెద్ద సంక్షోభం తలెత్తినప్పుడు ప్రజలంతా ఏకమవుతారని, ఈ ప్రస్తుతం కూడా ఆ ఐక్యతను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భాగవత్ అన్నారు. భారత్‌పై తప్పుడు కథనాలు సృష్టించే ప్రయత్నాలు దేశంతోపాటు విదేశాల్లోనే జరుగుతున్నాయని, దేశ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నా రని అన్నారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన మహారాణా ప్రతాప్ జయంతి వేడుకల్లో ఆయన ప్రసంగించారు. హల్దీఘాటి యుద్ధం తర్వాత మొఘలులు వెనుదిరగవలసి వచ్చిందని, దీన్ని మహారాణా విజయంగానే భావించాలన్నారు. భారత్ ఎదుగుదల దేశానికే కాదు, ప్రపంచానికి కూడా అవసరమే నన్నారు. కొందరు బానిసత్వాన్ని మనపై రుద్దాలనుకున్నారని అన్నారు. కానీ భారతావని ఎప్పుడూ సామాజిక, సాంస్కృతిక బాని సత్వాన్ని అంగీకరించలేదన్నారు.
ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధర్మాన్ని, సంస్కృతిని వీడ లేదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే అనేక వ్యూహాలను కొందరు అమలు చేస్తున్నారని ఆరోపించారు. మహారాణా ప్రతాప్ పోరా టం, ధర్మం, సంస్కృతి, స్వాభిమానాన్ని కాపాడేందుకు సాగిందన్నారు. ఆయన దేశస్వేచ్ఛ కోసమే యుద్ధం చేశారని చెప్పారు.
అలాంటి మహారాణా ప్రతాప్ జీవితంపై లోతైన అధ్యయనం అవసరమన్నారు. ఆయన స్ఫూర్తితో భారతీయులం దృఢంగా ఎదగాలని, వైవిధ్యమున్నా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండొచ్చ న్నారు. పరస్పర గౌరవం, సామరస్యం ముఖ్యమని భాగవత్ పేర్కొన్నారు.






