ఆటో–ప్రైవేట్ కాలేజీ బస్సు ఢీ: ఎనిమిది మందికి గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం, స్థానికుల్లో ఆగ్రహం
కోదాడ,(విజయక్రాంతి): మండల పరిధిలోని గణపవరం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీకు(Anurag Engineering College) చెందిన ప్రైవేట్ కాలేజీ బస్, ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది గాయపడగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… తొగర్రాయి గ్రామం నుంచి మల్లారెడ్డిగూడెం వైపు మిరపకాయ కూలీలను తీసుకెళ్తున్న ఆటోకు ఎదురుగా కందిబండ వైపు నుంచి వస్తున్న అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ బస్ గణపవరం గ్రామం వైపు అకస్మాత్తుగా మలుపు తిప్పింది. అనుకోకుండా బస్ మలుపు తిప్పడంతో ఆటో డ్రైవర్ అదుపు చేయలేక బస్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విజయలక్ష్మి, సావిత్రమ్మలకు తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రేణుక, సుకన్య, నాగమణి, రాంబాబు, వసంత సురేష్, ఉపేందర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారంతా ఒకే గ్రామానికి చెందినవారని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న కోదాడ రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా మలుపు తిప్పడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తూ కొంతసేపు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




