17 April, 2026 | 4:01 PM

ఆపరేషన్ ఛబుత్ర

29-12-2025 12:00 AM

జిల్లాలో నేరాలు కట్టడి చేసేందుకు

జిల్లాలో వినూత్న కార్యక్రమన్ని చేపడుతున్న పోలీసులు

రాత్రి వేళల్లో రోడ్లపై తిరుగుతున్న యువత అరెస్టు

రాత్రుళ్లు అనవసరంగా తిరిగితే చర్యలు తప్పవన్న : డీఎస్పీ

ఆదిలాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : జిల్లాలో నేరాలను కట్టడి చేసేందు కు, రోడ్డు ప్రమాదాలను, శాంతి భద్రతలను అదుపుచేసేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆపరేషన్ ఛబుత్ర పేరుతో రాత్రివేళలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ, అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న, ఇంటి బయట ఛబుత్ర (గద్దెల) పై కూర్చున్న యువతను అరెస్టు చేస్తూ స్టేషన్ కు తరలిస్తున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు డిఎస్పీ యల్. జీవన్ రెడ్డి నేతృత్వంలో గత రాత్రి 11:30 గంటల తర్వాత ఆదిలాబాద్ పట్టణంలో ఆపరేషన్ ఆపరేషన్ ఛబుత్ర పేరిట తనిఖీలు చేపట్టారు.

వన్ టౌన్, టూ టౌన్, మావల, రూరల్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని పలు కాలనీల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి అకారణంగా రోడ్లపై తిరిగే వారిని, ఇంటి ఎదుట ఛబుత్ర లపై కూర్చున్న 150 మందిని పట్టుకొని స్టేషన్ కు తరలించారు. అనంతరం వారికి డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించి, యువతను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.  ఆదిలాబాద్ పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, పదేపదే రోడ్లపై అనవసరంగా సంచరిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. అకారణంగా ఎవరైనా రోడ్లపై మరియు గద్దలపై హోటళ్ల ముందు, ప్రధాన కూడళ్ల వద్ద వారి వారి వీధులలో అనవసరంగా కూర్చోకుండా ఉండాలని సూచించారు.

పట్టణ వ్యాపార సమూహాలు రాత్రి 10:30 గంటలకు మూసి వేయబడతాయని, తదుపరి 11 గంటల వరకు ఇళ్లకు చేరుకావాలన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అర్ధరాత్రి పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణము కలగజేయడానికి, నేరాలను నియంత్రణకు యువత ఎలాంటి గొడవలకు దారి తీయకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని తెలియజేశారు. నేర రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలన్నారు.

ఇదేవిధంగా అర్ధరాత్రి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, గంజాయి టెస్టులు నిర్వహించడం జరుగుతుందని యువత సన్మార్గంలో ఉండాలని చెడు వ్యసనాలకు బానిస కాకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిం చారు. అత్యవసర సమయంలో మాత్రమే బైట తిరగాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐలు సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్, రూరల్ ఎస్త్స్ర విష్ణువర్ధన్, మావల ఎస్‌ఐ రాజకుమార్, మధుకర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, వెంకటి, మురళి, శ్రీపాల్, చంద్రశేఖర్ ఉన్నారు.