calender_icon.png 2 February, 2026 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ స్మైల్ విజయవంతం

02-02-2026 12:00:00 AM

50 మంది బాల కార్మికుల విముక్తి

జిల్లావ్యాప్తంగా 21 కేసుల నమోదు

46 బాలురు, 4 బాలికలను రక్షించిన యంత్రాంగం

14 మంది బయటి రాష్ట్రాల బాలబాలికలను రక్షించిన ఆపరేషన్ స్మైల్ బృందం

బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా 01 జనవరి 2026 నుండి 31 జనవరి వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే ఆపరేషన్ స్త్మ్రల్  XII అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,  తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన, వదిలివేయబడిన లేదా కార్మికులుగా పనిచేస్తున్న బాలబాలికలను గుర్తించి, వారికి రక్షణ కల్పించడం, యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, అలాగే తల్లిదండ్రులు ఉన్న పిల్లలను కౌన్సిలింగ్ అనంతరం కుటుంబాలకు అప్పగించడం లేదా తల్లిదండ్రులు లేని పిల్లలను చైల్ వెల్ఫేర్ కమిటీ  సంరక్షణకు అప్పగించడం అని తెలిపారు.

వ్యవసాయం, గనులు, నిర్మాణ రంగం, పరిశ్రమలు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, బిక్షాటన తదితర రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేయడం వల్ల వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని జిల్లా ఎస్పీ అన్నారు. సరైన విద్య, పోషకాహారం, క్రీడలు, సామాజిక అభివృద్ధి లేకుండా పిల్లలు సమగ్రంగా ఎదగలేరని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థకు పేదరికం, నిరక్షరాస్యత, తక్కువ ఆదాయం వంటి కారణాలే ప్రధానమని, అయితే చిన్నారులను పనుల్లోకి నెట్టడం వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమేనని స్పష్టం చేశారు.

నేటి బాలలే రేపటి పౌరులని, చిన్నారులే దేశ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ఈ ఏడాది ఆపరేషన్ స్త్మ్రల్  XIIలో భాగంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 21 కేసులు నమోదు చేసి, 46 మంది బాలురు, 04 మంది బాలికలు కలిపి మొత్తం 50 మంది బాల కార్మికులను విముక్తి చేసి రక్షించడం జరిగిందని తెలిపారు. వీరిలో 14 మంది బయటి రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు ఉన్నారని పేర్కొన్నారు.

18 సంవత్సరాల లోపు పిల్లలను వెట్టిచాకిరి, బలవంతపు బిక్షాటన, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలు, కిరాణా దుకాణాలు తదితర ప్రదేశాల్లో పని చేయించడం చట్టరీత్యా నేరమని, ఈ విధమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపించినా లేదా పిల్లలు పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే చైల్డ్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 లేదా అత్యవసర నెంబర్ 112, 100కు సమాచారం అందించాలని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, అభినందించారు.