22 July, 2026 | 2:03 AM

ఫీజు బకాయిలకు మోక్షమెప్పుడు?

22-07-2026 12:00 AM

కసిరెడ్డి మణికంఠ రెడ్డి :

* విద్య అనేది దేశంలోని పౌరుల ప్రాథమిక హక్కు. అది విలాసం కాదనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలి. కానీ నేడు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

పేద, మధ్యతరగతి, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి విఘాతం కలిగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రారంభించిన ఈ చరిత్రాత్మక పథకా న్ని స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రే నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్ సర్కార్ అనేక కొర్రీలు పెట్టింది. కళాశాలల ఫీజులు ఎంత ఉన్నా ప్రభుత్వం ఇచ్చేది మాత్రం ఇంతేనంటూ కోర్సులవారీగా కేసీఆర్ సర్కార్ స్లాబ్‌లు విధించింది. అంతేగాక రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ అరకొర నిధులను కూడా 2020 నుంచి పెండింగ్‌లో పెట్టింది.

దీంతో కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నడిచే కాలేజీలు మూతపడే పరిస్థితికి చేరాయి. అంతేకాదు, ఆయా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో ఉన్నత చదువులు చదివే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేని దుస్థితి నెలకొంది.

విద్య విలాసం కాదు!

విద్య అనేది దేశంలోని పౌరుల ప్రాథమి క హక్కు. అది విలాసం కాదనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలి. కానీ నేడు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో వారి భవిష్య త్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడల్లా విద్యకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. వాస్తవానికి ఈ పథకం మూలంగానే చాలామంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవగలుగుతున్నారు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను దగ్గర చేసిన ఈ పథ కం గత ఆరేళ్లుగా సరిగ్గా అమలు కావడం లేదు.

బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలోనే ఈ నిర్లక్ష్యానికి తొలుత బీజం పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్‌ఎస్ సర్కార్ బాటలోనే నడవడం విచారకరం. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది విద్యార్థుల ఫీజులు ఈ ప్రభుత్వం బకాయి పడింది.

ఫీజు బకాయిలు ఇవ్వాలని విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు రోడ్డెక్కి ఉద్యమిస్తు న్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. బకాయిలు విడుదల కాకపోవడంతో ఫీజుల కోసం అనేక ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. కొన్నిచోట్ల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, పరీక్షలకు అనుమతించకపోవడం వంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. 

హైకోర్టును ఆశ్రయించినా..

రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యా లు హైకోర్టును ఆశ్రయించాయి. గతంలో మాదిరిగా కాకుండా జీవో నెంబర్ 7 తీసుకువచ్చి విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు బకాయిలు జమచేస్తామని ప్రభుత్వం చెప్పిం ది. కాలేజీ యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్తే, ఫీజు బకాయిలు విడుదల చేసే వరకు విద్యార్థుల వద్ద నుంచి కళాశాల యాజమాన్యాలు ఫీజు బకాయిలు విడుదల చేసుకోవచ్చని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

మళ్లీ ప్రభుత్వం జీవో నెంబర్ 7 రద్దు చేసి జీవో నెంబర్ 8, 9లను తీసుకువచ్చింది. ఏ జీవో తీసుకువచ్చినా ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదలపై స్పష్టత లేదు. మళ్లీ హైకోర్టు కొన్ని రోజుల కింద యాజమాన్యాలకు అనుకూలంగానే తీర్పు ఇచ్చి ఫీజులు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఆగస్టు 15లోపు విడుదల చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. కానీ, గత ఆరేళ్ల బకాయిల సంగతి మాత్రం మరిచిపోయింది. 

కళాశాలలకు తాళాలు 

ఇప్పటివరకు 2020- 2021 2022 2023 2024 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల మొత్తం రూ.11,000 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి నిధులు ఇవ్వకుండా గత బీఆర్‌ఎ స్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఫలితమే ఇది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం ఆర్థిక వ్యవస్థ బాగాలేదని, కేసీఆర్ రాష్ట్రా న్ని అప్పులపాలు చేశారని అంటూ కాలయాపన చేస్తున్నది.

అదే సమయంలో వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తూ రాష్ట్ర పాలనను కొనసాగిస్తున్నామని పాలకులు చెప్తున్నారు. మరి గత 30 నెలల్లో చేసిన అప్పులలో నుంచి విద్యార్థుల చదువులకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? గత బీఆర్‌ఎ స్ ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకుండా వేల కోట్ల రూపాయల భారం వేసింది వాస్తవమే.

అవి ఒకేసారి విడుదల చేయడం సాధ్యం కాకపోతే, కాంగ్రెస్ పాలకులు కనీసం వారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను అయినా విడుదల చేయాలి కదా! ప్రభుత్వం ఎన్నికల రాజకీయాలు చేస్తూ, ఓట్లు ఉన్న వర్గాలకు పెండింగ్ నిధులు విడుదల చేస్తున్నది. అదే సమయంలో విద్యార్థులకు ఫీజు బకాయిలు విడుదల చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నది.

ఫీజు బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, భవన కిరాయిలు కట్టేందుకు కూడా ఇబ్బందిగా ఉందని, తాము కళాశాలలు నడపలేమంటూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల వారు కొన్ని నెలల కింద కళాశాలలు బంద్ చేశాయి. సెమిస్టర్ పరీక్షలు బహిష్కరించారు. దాంతో నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేస్తామని చెప్పి పాలకులు తప్పించుకున్నారు. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ బకాయిల నిధుల జాడ లేదు. 

వైఎస్ స్ఫూర్తికి రేవంత్ విఘాతం

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని నేటి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్నప్పటికీ, విద్యార్థుల సమస్యలు ఎందుకు పరిష్కారానికి నోచుకోవడం లేదు? ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలపై సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్న సీఎం విద్యాశాఖపై సమీక్షలు చేయకపోవడం శోచనీయం. కనీసం చదువులకు నిధులు విడుదల చేయకపోవడం దారుణం.

ఈ నేపథ్యంలోనే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 23వ తేదీన ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై వెంటనే సమీక్ష నిర్వహించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను మొత్తం ఒకేసారి విడుద ల చేయాలి. విద్యార్థుల ఇబ్బందులను తీర్చి, రాష్ట్రంలో విద్యారంగం బలోపేతానికి కృషి చేయాలి.

 వ్యాసకర్త: ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, 7569548477