25 July, 2026 | 12:46 AM

ఈ ఏడాది మా చిత్రమే బెస్ట్ ఎంటర్‌టైనర్!

25-07-2026 12:16 AM

యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నేను రెడీ’. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తోంది. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, మురళీశర్మ, శ్రీలక్ష్మి, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తొలి పాట ‘కొంచెం కొంచెం’ విడుదలైంది.

మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాయగా, సమీరా భరద్వాజ్ పాడారు. ఈ పాటలో హవీష్, కావ్యా థాపర్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఇదే పాటలో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ స్పెషల్ అప్పియరెన్స్, స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ మరింత ఆకర్షణగా నిలుస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు బాబీ, కేఎల్ నారాయణ అతిథులుగా విచ్చేశారు.

ఈ వేడుకలో హీరో హవీష్ మాట్లాడుతూ.. “నాకు కాస్త సిగ్గు ఎక్కువ. కానీ త్రినాథరావు నాతో ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయించారు (నవ్వుతూ). నటనలోనే నాకు సంతృప్తి ఉంటుంది. నా కెరీర్‌లో ఇది బెస్ట్ సినిమా అవుతుంది. ఈ ఏడాది వచ్చే బెస్ట్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ” అన్నారు. ‘ఈ సినిమా నాకు చాలా మంచి అనుభవంగా నిలిచింది. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అని కథానాయకి కావ్యా థాపర్ చెప్పింది.

దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. “ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ తీశాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని తెలిపారు. నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమా కన్నుల పండుగలా ఉంటుంది. కుటుంబం మొత్తం కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది” అన్నారు. ఈ వేడుకలో మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి, మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.