25 July, 2026 | 1:45 AM

విద్యార్థుల పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నా!

25-07-2026 12:20 AM

ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారాలను నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. విద్యార్థులకు మద్దతుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి చేతులెత్తి దండం పెడుతున్నాననంటూ భావోద్వేగమైన పోస్ట్ రాశారు.

“నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు పరిహారం ఎవరూ అడక్కుండా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోడానికి లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తింటున్నారు. విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉంది. ప్రభుత్వం వాళ్ల మాట వినాలి. వాళ్లకు భరోసా ఇచ్చి, స్ఫూర్తిని గెలిపించాలి. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టే.. వాళ్లు గెలిస్తే మనం బతికినట్టు” అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.