24 July, 2026 | 12:49 AM

నీట్ ఫైట్‌కు సినీతారల మద్దతు

24-07-2026 12:00 AM

నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం చేస్తున్న పోరాటానికి, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘చలో సంసద్’ నిరసనలకు సినీ ప్రముఖులు తమ సంఘీభావం ప్రకటిస్తున్నారు. మొత్తంగా విద్యార్థుల నిరసన ప్రదర్శనకు సినీపరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. నార్త్, సౌత్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు కొందరు నేరుగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటుండగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

సీనియర్ నటులు షబానా ఆజ్మీ, ప్రకాశ్‌రాజ్ నిరసనకారులకు మద్దతుగా నేరుగా రంగంలోకి దిగారు. వీరిద్దరూ సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన మా ర్చ్‌లో నిరసనకారులతో కలిసి ఒక ట్రక్కులో ప్రయాణిస్తూ, బారికేడ్లను దాటుకుంటూ వెళ్లిన ఫో టోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

షబానా అజ్మీ, ప్రకాశ్‌రాజ్‌తోపాటు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కోలీవుడ్ యంగ్ హీరోయిన్లు ప్రియా ప్రకాశ్ వారి యర్, ‘జాను’ సినిమా ఫేమ్ గౌరీ జీ కిషన్ స్వయంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకు ని, విద్యార్థులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. నటి గౌరి కిషన్ కేరళలోని కొచ్చిలో విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీలోనూ స్వయంగా పాల్గొన్నారు. ముంబయి దాదర్‌లోని ప్రసిద్ధ శివాజీ పార్క్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ఖాన్ పాల్గొన్నారు.

సల్మాన్‌ఖాన్, అలియా భట్, సోనాక్షి సిన్హా, ఇమ్రాన్ ఖాన్, రాజ్‌కుమార్ రావు, ప్రీతి జింతా, వీర్ దాస్, నసీరుద్దీన్ షా వంటి ప్రముఖులు విద్యార్థుల పక్షాన నిలిచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నటుడు విజయ్ వర్మ.. విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునకు మద్దతు ఇస్తూ జవాబుదారీతనం కావాలని కోరారు. నటుడు అనుపమ్ ఖేర్.. విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతూనే, ఈ పవిత్రమైన విద్యార్థి ఉద్యమాన్ని వేరే శక్తులు హైజాక్ చేయకుండా చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ముంబైలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ విద్యార్థులతో కలిసి నడిచారు. విద్యార్థులను పలకరిస్తూ, వారితో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహపరిచారు. ఇలా వివిధ మాధ్యమాల ద్వారా సెలబ్రిటీల నుంచి లభిస్తున్న ఈ భారీ మద్దతుతో నీట్ వ్యతిరేక ఉద్యమానికి జాతీయ స్థాయిలో మరింత మద్దతు లభించినట్టయ్యింది. 

విద్యావ్యవస్థలో అక్రమాలు క్షమార్హం కాదు: కమల్ హాసన్ 

ఒక విద్యార్థి బాధపడినప్పుడే మనం విని ఉంటే బాగుండేది. కానీ, చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయే వరకూ వేచి చూశాం. చదువు స్థానంలోకి కోచింగ్, నేర్చుకోవాలనే తపన స్థానంలోకి ఆందోళన, ప్రతిభకు బదులు క్రిమినల్ మైండ్స్ వచ్చాయి. దీంతో ఈ వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోయింది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సింది బదులు మన పిల్లలను బారికేడ్లు, లాఠీలతో ఎదుర్కొంటున్నాం.

వ్యవస్థ విఫలమైందనడానికి ఇది ఉదాహరణ. విద్యార్థులు తమ బాధ్యతను తాము నిర్వర్తించారు. ఇప్పుడు దేశం తన బాధ్యతను నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాల కంటే విద్యార్థుల కలలు ఎప్పుడూ గొప్పవిగా నిలవాలి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పోరాడుతున్న ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్షవిరమించాలి. 

విద్యార్థుల ఆవేదన సరైనదే: విజయ్ సేతుపతి 

న్యాయం కోసం విరామం లేకుండా పోరాడుతున్న విద్యార్థుల ఆవేదన సరైనదే. వారికి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. వారికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలి.  

గుండె తరుక్కుపోతోంది: దుల్కర్ సల్మాన్ 

విద్యార్థుల ఆవేదనను విని వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. విద్య అంటే ఆశ, అవకాశం, మెరుగైన భవిష్యత్తుకు నమ్మకం. యువత ఇలా అనిశ్చితిని ఎదుర్కోవడం ఎంతో బాధాకరం. ఇది చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ నిరసనలు ఆగేందుకు అర్థవంతమైన చర్చలు జరగాలి. శాంతియుతంగా పరిష్కారాలను ఆలోచించాలని కోరుకుంటున్నా. హింసాత్మక పరిస్థితులకంటే.. అర్థం చేసుకుని నిర్మించుకున్న భవిష్యత్తు ఎప్పుడూ బలంగా ఉంటుంది.  

బాధ్యులను అలా శిక్షించాలి: ఆర్ మాధవన్

అర్థవంతమైన సంస్కరణల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థుల పట్టుదల అభినందనీయం. ఈ ఉద్యమాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి, దాన్ని నిజమైన ఉద్దేశం నుంచి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించేవారితో ప్రతి విద్యార్థీ అప్రమత్తంగా ఉండాలి. పరీక్షా పత్రాల లీక్‌ల వంటి సంఘటనలు విద్యా వ్యవస్థపై విద్యార్థులు పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి.

విద్య కీలక పాత్ర పోషించే భారత్ లాంటి దేశంలో ఇవి ఎంతో మంది యువకులు, వారి కుటుంబాల ఆశలను, కష్టాన్ని, కలలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ వ్యవహారంలో బాధ్యులైన ప్రతి ఒక్కరినీ త్వరగా చట్టం ముందుకు తీసుకురావాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. మన యువత భవిష్యత్తుతో ఆడుకోవడానికి మరోసారి ఎవరూ సాహసించని విధంగా వారిని శిక్షించాలి. 

పేపర్ లీక్ తీవ్రమైన అంశం: సల్మాన్ ఖాన్

పేపర్ లీక్ చాలా తీవ్రమైన అంశం. మెరుగైన విద్యావ్యవస్థను కోరుతూ విద్యార్థులంతా ఒక్కటై ముందుకు రావడం, వారికి తల్లిదండ్రులు తోడుగా నిలవడం అభినందనీయం. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగి నిరసన.. హింసాత్మకంగా మారడం నన్ను తీవ్రంగా బాధించింది. ఈ ఘటనలో గాయపడిన వారికి, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. 

విద్యార్థుల కలలు నెరవేరాలి: ఆలియా భట్ 

విద్యార్థుల ఆందోళనలు తన హృదయాన్ని గాయపరిచాయి. విద్యార్థుల కలలు, వారి కుటుంబాల త్యాగాలు రక్షించబడాలి. 

వ్యవస్థలోనూ జవాబుదారీతనం ఉండాలి: ఇమ్రాన్ ఖాన్ 

మన దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం ఇది. పరీక్షలు రాసే విద్యార్థుల నుంచి మనం నిజాయితీని కోరుకున్నప్పుడు, ఆ పరీక్షలను నిర్వహించే వ్యవస్థకు కూడా అంతే జవాబుదారీతనం ఉండాలి. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతపై హింసకు తావులేదు. 

ఆ ప్రాణాలు వెలకట్టలేనివి: నోరా ఫతేహీ 

బాధలో ఉన్న ప్రతి విద్యార్థికి, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక మద్దతు ఉంటుంది. విద్య అంటే కేవలం మార్కులు కాదు.. అదొక ఆశ, ఒక స్వప్నం. పేపర్ లీక్ వార్తలు యువతను తీవ్ర నిరాశకు గురి చేశాయి. విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు నన్ను కుదిపేశాయి. ఏ పరీక్ష లేదా ఏ వ్యవస్థ కూడా ఒక యువ ప్రాణాన్ని బలిగొనేలా ఉండకూడదు.

పిల్లల్ని కోల్పోయిన కుటుంబాల బాధ వర్ణనాతీతం. భారతీయ విద్యార్థుల ధైర్యం, పట్టుదల చూసి నేను ఆశ్చర్యపోయా. తన ప్లాట్‌ఫామ్ ద్వారా వారికి మద్దతు తెలపాలని నిర్ణయించుకుంటున్నా. విద్యార్థుల భద్రత కోసం ప్రార్థిస్తున్నా. ఈ సమస్యకు త్వరలో సరైన పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నా.  

మద్దతుగా నిలవడం రాజకీయం కాదు: అదితిరావు హైదరీ 

నేను ఒక నటిగా కాకుండా బాధ్యతాయుతమైన పౌరురాలిగా మాట్లాడుతున్నా. కష్టాల్లో ఉన్నవారికి మద్దతుగా నిలవడం వెనక ఎలాంటి రాజకీయాలు ఉండవు. ఇది కేవలం మానవత్వంతో చేసిన ఆలోచన మాత్రమే.   

వినడమే మన పని: ఇంతియాజ్ అలీ 

మన భవిష్యత్తు కోసం మనం చేయాల్సిందల్లా వారి (విద్యార్థుల) మాటలు వినడమే.