31-07-2024 01:35:15 AM
పంట బీమా పథకాన్ని అమలు చేస్తాం
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
గత ప్రభుత్వం రుణమాఫీ వడ్డీలకే సరి..
రైతు భరోసాపై నిపుణులతో చర్చిస్తున్నాం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లాకు మంత్రి తుమ్మల కౌంటర్
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు అడుగడుగునా అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ పథకాన్ని రాష్ట్ర సర్కార్ సద్వినియోగం చేసుకోలేదని మండిపడ్డారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖకు సంబంధించి పద్దుపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మధ్య వాడివేడి చర్చ జరిగింది.
వ్యవసాయం మీద అవగాహన ఉన్న మంత్రి తుమ్మల ఆ శాఖకు ప్రత్యేక పాలసీ తీసుకురాలేదని, బీఆర్‌ఎస్ హయాంలో వ్యవసాయాన్ని ఒక పండుగలా చేశామని, స్వామినాథన్ లాంటి శాస్త్రవేత్తల సాయంతో వ్యవసాయ పాలసీ తీసుకొచ్చామని పల్లా అన్నారు. 70 లక్షల మంది రైతులకు 1.52 లక్షల ఎకరాలకు రూ.82 వేల కోట్లు రైతు బంధు ఇచ్చామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతుల మరణాలు తగ్గాయని స్పష్టంచేశారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. బీఆర్‌ఎస్ ప్రభత్వం ఏ రైతును ఆదుకోలేదని, కేంద్రం ఇచ్చే పథకాలను కూడా వాడుకోలేదని మండిపడ్డారు. విత్తనాలు తెచ్చుకోవడానికి అప్పులు తెచ్చారని, రైతులకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదని దుయ్యబట్టారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా తమ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా నిలబడిందని స్పష్టంచేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే.. ఆ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని తుమ్మల ధ్వజమెత్తారు. ఓఆర్‌ఆర్‌ను తాకట్టు పెట్టి ఎన్నికలకు నెల రోజుల ముందు రైతు బంధు ఇచ్చారని ఆరోపించారు. రైతు బంధుకు తమ ప్రభుత్వం రూ.7,500 కోట్లు చెల్లించినట్టు, పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ సభ్యులు కూడా తమకు సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు. రైతులు పంట నష్టపోతే పంటల బీమా పథకం ద్వారా పరిహారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని, రైతు భరోసాపై కూడా చర్చిస్తామని తెలిపారు. అన్ని పంటలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు.