31-07-2024 01:34:11 AM
అవినీతి జరిగితే నాదే బాధ్యత
త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు
సన్న బియ్యం పంపిణీ
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
పౌరసరఫరాల శాఖలో రూ.11౦౦ కోట్ల అవినీతి
హౌజ్ కమిటీ వేయాలని ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్
అంగీకరించకపోవడంతో సభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి పారిపాయారు: శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): సివిల్ సప్లయ్ శాఖలో రూపాయి అవినీతి జరుగలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ఒక వేళ అవినీతి జరిగినట్టు తేలితే మంత్రిగా తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పౌరసరఫరా శాఖపై వాడివేడిగా చర్చ జరిగింది. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్టు తెలిపారు.
ఆగస్టు 1న జరిగే మంత్రివర్గ సమావేశంలో విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు. రేషన్ కార్డులపై సన్న బియ్యం కూడా ఇవ్వనున్నట్టు పునరుద్ఘాటించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారందరికి రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని అన్నారు. సివిల్ సప్లయ్ శాఖలో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రూ.11౦౦ కోట్ల ఆదాయం సంస్థకు వచ్చిందని తెలిపారు. సన్న బియ్య ఒక గింజ కూడా కొనుగోలు చేయనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఉత్తమ్ ప్రశ్నించారు. టెండర్లలో ప్రభుత్వం పారదర్శకంగా మందుకెళ్లుతోందని తెలిపారు. అంతకు ముందు కేటీఆర్ మాట్లాడుతూ.. సివిల్ సప్లయ్ శాఖలో రూ. 11౦౦ కోట్ల అవినీతి జరిగిందని, దానిపై హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని నిరసన తెలుపుతూ కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
సభ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పారిపోయారు : మంత్రి శ్రీధర్‌బాబు
సభలో సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పామని, వాళ్లకు ఏమి మాట్లాడాలో తెలియక సభ నుంచి పారిపోయారని బీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామ ని, సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పడంతోపాటు సివిల్ సప్లయ్ శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదని మంత్రి ఉత్తమ్ స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ సభ్యులు సభను వాకౌట్ చేయడం శోచనీయమన్నారు.
బీఆర్‌ఎస్ హయంలో ధాన్యం సేకరణ విషయంలో తరుగు పేరుతో 10 కేజీలు కొట్టేసి రైతులకు తీవ్ర నష్టం చేశారని మండిపడ్డారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఒక్కసారి కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అనేక మంది రైతులు చనిపోతే ఒక్కరోజు పరామర్శకు వెళ్లలేదని.. వీళ్లా రైతుల గురించి మాట్లాడేదని దుయ్యబట్టారు. సన్న వరి సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వంపై బురద జల్లుతామనే వైఖరి సరికాదని అన్నారు. గతంలో ఇంత మంది ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చిందన్నారు.
అసెంబ్లీ నేటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ.. వివిధ పద్దులతోపాటు ఒక బిల్లును ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వివిధ శాఖలపై చర్చించారు.
సివిల్ సప్లయ్ శాఖపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్‌తో అసెంబ్లీ దద్దరిల్లింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తంచేశారు. సభా మర్యాద పాటించాలని సూచించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ.. మంగళవారం తెల్లవారు జామున ఉదయం 3.15 నిమిషాల వరకు.. 17 గంటల పాటు జరగడం విశేషం.