పాదయాత్రకు అనూహ్య స్పందన
ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
వెల్దుర్తి, ఆగస్టు 31: వెల్దుర్తి మండల కేంద్రం నుండి చెట్టుపల్లి కలాన్ వరకు రహదారి నిర్మాణ పనులు మొదలుపెట్టాలని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి చేపట్టిన పాదయాత్రకు సోమవారం భారీ స్పందన లభించింది.
రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సునీత రెడ్డి వెల్దుర్తి, శివంపేట్, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి బారీ పాదయాత్ర నిర్వహించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
పోతుల బోగోడనుండి చెట్టుపల్లి కలాన్ వరకు సాగిన పాదయాత్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రహదారి నిర్మాణం చేపట్టాలని, తమ రవాణా కష్టాలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ, వేలాదిమంది ప్రజలు పాదయాత్రలో ముందుకు సాగారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెల్దుర్తి నుండి మెదక్ రహదారికి గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరు అయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తమ మొండి వైఖరితో కావలసిన నిర్లక్ష్యం చేసి ఇట్టి పనులను పెండింగ్లో పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గుంతలు, కంకర, బురదతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని తెలిపారు.
రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. రహదారి దుస్థితి కారణంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా ప్రభావితమయ్యాయని, దీంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు, ఇతర వాహనాలు రాకపోకలు సాగించడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఇట్టి రహదారి పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.
ప్రజల కష్టాలు పట్టించుకోవాలి
బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా.. ప్రభుత్వం మారిన అనంతరం వాటిని రద్దు చేసి పనులు నిలిపివేశారని నాయకులు ఆరోపించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వెంటనే నిధులు విడుదల చేసి డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, మోహన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






