11-09-2024 01:33:44 AM
మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఇవ్వడం పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షానికి చెందిన వారికి ఆ పదవిని ఇవ్వడం దేశంలో ఆనవాయితీగా వస్తోందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కమిటీల ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించారని, నామినేషన్లు వేయడం, ఉపసంహరించుకోడానికి రెండు గంటలే సమయమిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నిక పూర్తయిన తర్వాత స్పీకర్ అసెంబ్లీలోనే కమిటీ సభ్యుల పేర్లు ప్రకటించాలని, అందుకు విరుద్ధంగా 38 రోజుల తర్వాత కమిటీలను ప్రకటించడం సరికాదన్నారు. అసెంబ్లీ రూల్ బుక్ లో నిబంధన 250 ప్రకారం ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేల సంఖ్యను పీఏసీలో సభ్యులుగా అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఈ ప్రకారం బీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు సభ్యులకు అవకాశం కల్పించగా తనతో పాటు హరీశ్ రావు, గంగుల కమలాకర్ నామినేషన్లు వేశామన్నారు.
మధ్యలో అరికెపూడి గాంధీ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదన్నారు. సభ్యుల కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చినప్పుడు ఓటింగ్ జరపాల్సింది పోయి హరీశ్ రావు నామినేషన్‌ను తొలగించి అరికెపూడి గాంధీ పేరును బీఆర్‌ఎస్ తరఫున ఎలా అనుమతించారని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ప్రపంచమంతా చూసిందని, అన్ని మీడియా ఛానెళ్లలోనూ ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు ఫొటోలు వచ్చాయన్నారు. తాను కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని అరికెపూడి బుకాయిస్తే ఎలా కుదురుతుందన్నారు.