7 May, 2026 | 11:49 AM

విద్యాధికులనే బురిడీ కొట్టిస్తున్నారు?

07-05-2026 11:18 AM

సైబర్ వలలో చిక్కుకున్న ఉపాధ్యాయుడు 

రూ.82.40 లక్షలకు కుచ్చు టోపీ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఓవైపు డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దని ప్రభుత్వం, బ్యాంకులు, పోలీసులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ, మరోవైపు విద్యాధికులే సైబర్ నేరాలకు చిక్కి తరచుగా మోసపోతున్నారు. ఇదే క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తాజాగా సైబర్ వలలో చిక్కుకొని ఏకంగా 82 లక్షల 40 వేల రూపాయలు పోగొట్టుకున్న ఘటన వెలుగు చూసింది. గత నెల 11న వాట్సాప్ కాల్ ద్వారా ఆ ఉపాధ్యాయుడికి ఫోన్ రావడంతో అతని భార్య లిప్ట్ చేసింది. ఉపాధ్యాయుడి ఆధార్ కార్డు నంబర్ 17 వేదింపు కేసులు నమోదు చేయడం జరిగిందని, మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తామని హెచ్చరించారు.

వాట్సాప్ వీడియో కాల్ చేస్తామని చెప్పి అవతలి వ్యక్తి పోలీస్ యూనిఫాంలో ఉండి మీ బ్యాంకు ఖాతాలో అంతర్జాతీయ నేరగాడు 75 లక్షలు వేశాడని, మీ మీద అరెస్టు వారెంట్ జారీ అయిందని, మళ్లీ ఇంకో అధికారి లైన్లోకి వచ్చి డబ్బులు పూర్తిగా చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేయాలంటూ హెచ్చరించారు. దీనితో భయపడ్డ ఆ టీచర్ తన వద్ద ఉన్న 20 లక్షల రూపాయలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు 19 లక్షలు,  ఆయన భార్య ఖాతాలో ఉన్న రెండు లక్షలు, ఆయన భార్య పేరుతో ఉన్న ఫిక్షుల డిపాజిట్ డబ్బులు తొమ్మిది లక్షలు, బంగారం లోను తీసుకుని 18 లక్షలు, ఎల్ఐసి లోన్ తీసుకొని 12 లక్షలు కలిపి ఏప్రిల్ 15న నేరగాళ్లు చెప్పిన అకౌంట్ కు 49 లక్షలు, 18న 22 లక్షల 20వేలు, 22న 11 లక్షల ఇరవై వేలు సైబర్ నేరగాలు చెప్పిన అకౌంట్ కు ఆర్టిజిఎస్ ద్వారా జమ చేశారు.

ఆ తర్వాత ఈనెల 2న మీరు చెల్లించిన డబ్బులు జమ అయ్యాయని, విచారణ పూర్తికాగానే మీ డబ్బులు మీకు జమ చేస్తామని ఆ దంపతులను నమ్మించారు. తీరా మూడో తేదీన బాధితులు వారు చేసిన నెంబర్కు కాల్ చేయడంతో సమాధానం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి మహబూబాబాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై మహబూబాబాద్ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. విద్యాధికులు, ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పి చైతన్యవంతులను చేసిన విద్యాధికులే సైబర్ నేరాల బారిన పడటం మానుకోట పట్టణంలో సంచలనం సృష్టించింది.