calender_icon.png 12 November, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త జట్టులోకి ఎవరెవరు?

11-09-2024 01:28:51 AM

  1. పీసీసీ కార్యవర్గ సభ్యుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ
  2. సీఎంతో పాటు మంత్రులు, పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు
  3. ఎవరికి వారు పావులు కదుపుతూ తీవ్రంగా ప్రయత్నాలు
  4. రేపు ఢిల్లీకి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కూమార్ గౌడ్.. పార్టీ అగ్రనేతలతో భేటీ

హైదరాబాద్,సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్ గౌడ్‌ను నియమించడంతో ఇప్పుడు పార్టీ కార్యవర్గ కూర్పుపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడి ప్రకటనను ఆలస్యం చేసినట్లుగానే అధిష్ఠానం కొత్త జట్టు ఎంపికైనా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తుందా ? లేదా ? ఎంపికలో స్పీడ్ పెంచుతుందా..? అనే విషయం పార్టీలోనే అంతర్గత చర్చ నడుస్తున్నది.

ఎవరెవరిని ఎంపిక చేయాలనే అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు చర్చోపర్చలు నిర్వహించి అధిష్ఠానానికి ఓ నివేదిక పంపినట్లు తెలిసింది. కొత్త కార్యవర్గ కూర్పులో తమ వర్గానికి చోటు కల్పించాలని ఇప్పటికే పలువురు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ల నుంచి పీసీసీ నూతన అధ్యక్షుడిపై ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తున్నది. ఇప్పుడు పీసీసీలో చోటుదక్కించుకుంటే మున్ముందు పదవులు దక్కించుకోవచ్చనేది ఆశావహుల ఆలోచన. ఆశావహుల్లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు బోగట్టా.

కానీ, పార్టీ అధిష్ఠానం మాత్రం సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటుందనే ప్రచారం జోరందుకున్నది. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారికి, పార్టీ పదవుల్లో అవకాశం కల్పించవద్దనే డిమాండ్ పలువురి నుంచి వినిపిస్తోంది. ఒక వ్యక్తికి జోడు పదవులు ఉంటే.. అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి పూర్తి సమయం కేటాయించలేరని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

మొన్నటివరకు పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఉండగా, ఆయన కార్యవర్గంలో ఉన్న పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలయ్యారు. పార్టీ అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులతో పాటు మరికొందరికి నామినేటెడ్ పదవులు సైతం వరించాయి. వీరిలో కొందరు నాయకులు ఇప్పటికే పార్టీ పదవుల్లోనూ ఉండాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.   

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా ఐదుగురు?

పార్టీ అధిష్ఠానం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా ఐదుగురిని నియమిస్తుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. ఈ పదవుల రేసులో ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, ప్రభుత్వ విప్ అడ్లూరి శ్రీనివాస్‌తో పాటు మరో ప్రభుత్వ సలహాదారు పేరు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ కూడా తనకు మరోసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వ పదవుల్లో ఉండి కూడా మరోవైపు పార్టీ పదవులు అడగడమేంటనీ..? సొంత పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్రభుత్వ పదవుల్లో లేని వారికే పీసీసీ కొత్త జట్టులో చోటు కల్పిస్తే.. వారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని కొందరు సీనియర్లు వాదిస్తున్నారని సమాచారం. పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లతో పాటు పీసీసీ అధికార ప్రతినిధులుగా పనిచేసిన వారిలో చాలామందిని నామినేటెడ్ పదవులు వరించాయి. దీంతో పార్టీ అనుబంధ సంఘాలకూ కొత్త కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది. జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులనూ సైతం కొత్తవారిని  నియమించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలకు ముందే డీసీసీ అధ్యక్షుల నియమాకంతో పాటు పూర్తి కార్యవర్గాన్ని నియమిస్తే బాగుంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

15న మహేష్‌కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ..

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఈనెల 15న పీసీసీ అధ్య క్షుడిగా మహేష్‌కుమార్ గౌడ్   బా ధ్యతలు తీసుకోనున్నారు. అందుకు నాయకులు గాంధీభవన్‌ను ము స్తాబు చేస్తున్నారు. భవన్ ఆవరణలోని ఖాళీ స్థలంలోనే సభ జరు గనున్నది. ఈ నేపథ్యంలో మహేష్‌కుమార్ గౌడ్ గురువారం ఢిల్లీకి చేరుకుని ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, అధ్య క్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్న  మహేష్‌కుమార్ గౌడ్ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలను కలిసే పనిలో బిజీ బిజీగా ఉన్నారు.